ప్రపంచంలో ఎక్కడా కనిపించని అద్భుతం.. తలక్రిందులుగా తపస్సు చేస్తూ.. దర్శనమిస్తున్న పరమశివుడు..!!

| Edited By: Jyothi Gadda

Oct 23, 2024 | 11:23 AM

ఈ శక్తి కుండంలోనికి కాశీ నుండి అంతర్వాహినిగా గంగ ప్రవహిస్తుందని కధనం. దీంతో ఈ శక్తి కుండం చెరువు గంగతో సమానమైనదిగా ప్రసిద్ధిగాంచింది. స్వామివారి అభిషేకాలకు ఈ నీటినే అర్చకులు ఉపయోగిస్తారు. శక్తికుండంలో స్నానం చేసి శక్తిశ్వర స్వామిని దర్శించుకుంటే అపమృత్యు భయాలు తొలుగుతాయని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

ప్రపంచంలో ఎక్కడా కనిపించని అద్భుతం.. తలక్రిందులుగా తపస్సు చేస్తూ.. దర్శనమిస్తున్న పరమశివుడు..!!
Shakteeswara Swamy Temple
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో ఈ అద్భుతం నెలకొంది. శైవ క్షేత్రాల్లో, ఆలయాల్లో ఎక్కడైనా శివుడు లింగరూపంలో ఉంటారు. కానీ యనమదుర్రు శివాలయంలో శక్తేశ్వరస్వామి తలకిందులుగా తపస్సు చేస్తూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం తవ్వకాల్లో బయటపడింది. ఈ తవ్వకాల్లో శివుని రూపమైన శక్తేశ్వరస్వామి, మూడు నెలలు పసిబిడ్డ అయిన కుమారస్వామిని ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తూ ఉన్న పార్వతీమాత విగ్రహాలు ఒకే పీఠంపై బయటపడ్డాయి. నంది విగ్రహం తోపాటు మరికొన్ని విగ్రహాలు లభించాయి. స్టలపురానం ప్రకారం ఒకప్పటి యమునాపురం ప్రస్తుతం యనమదుర్రు గ్రామంగా పిలవబడుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో శంబరుని అనే రాక్షసుడు సంచరించేవాడు. ఇక్కడ తపస్సు చేసుకునే మునులకు, ఋషులకు ఆటంకం కలిగిస్తూ వారిని హింసించేవాడు. మునులు, ఋషులు కలిసి యమధర్మరాజు వద్దకు వెళ్లి అతనిని సంహరించమని ప్రార్థించారు. యమధర్మరాజు శంబరుని తో యుద్ధం చేసి అనేకసార్లు ఓడిపోయాడు. అపజయం పాలై, అవమానభారంతో పరమేశ్వరుని కోసం అక్కడే ఘోర తపస్సు చేసాడు యమధర్మరాజు. కానీ యోగ నిద్రలో ఉన్న శివుడు యమధర్మరాజు తపస్సును గుర్తించకుండా దీక్షలోనే ఉండిపోయారు. కానీ పార్వతి మాత్రం యముని తపస్సు మెచ్చి తన శక్తి అంశంను యమధర్మరాజుకు ప్రసాదించింది. ఆ శక్తితో యమధర్మరాజు శంబరుని సంహరించాడు.

మహాశక్తి తనపై చూపించిన కరుణకు కరిగిన యమధర్మరాజు తన విజయానికి గుర్తుగా ఈ ప్రాంతానికి యమపురి అని నామకరనం చేశారు. ఇది కాలక్రమంలో యమునాపురం గాను ప్రస్తుతం యనమదుర్రుగాను పిలవబడుతుంది. రాక్షసులు సంచరించడానికి వీలు లేకుండా పార్వతి, పరమేశ్వరులను ఇక్కడ వెలియమని సమవర్తి ప్రార్థించాడు. దీనితో యముని కోరిక మేరకు తన మూడు నెలల పసివాడైన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని పార్వతి దేవి వెలిశారు . పరమేశ్వరుడు శీర్షాసనం వేసి యోగ నిద్రలో కనిపిస్తుంటారు. ఇద్దరూ ఒకే పీఠంపై స్వయంభువుగా వెలిసినట్లు చెబుతారు. ఆలయ చరిత్ర ను వివరిస్తూ దేవస్థానం ప్రచురించిన పుస్తకంలోని కధనం ప్రకారం భీమవరం ప్రాంతానికి మహా సముద్రమైన బంగాళాఖాతం మహా చేరువుగా ఉంది. అప్పట్లో ఇక్కడ శంబరీవి ద్వీపం ఉండేది. ఆ ద్వీపం లో శంబురునీ ఉనికి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ శంబరుని అనే రాక్షసుడు శ్రీరామచంద్రుడు కాలం నాటి వాడు కావడంతో ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా తెలుస్తోంది.

ఆలయంలోని శక్తిశ్వరుడు శీర్షాసనం వేసి యోగ నిద్రలో ఉంటారు. ఇటువంటి శివుని విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. స్వామివారి జటాజూటం నేలను తాకుతుంది. ముఖం, ఆ పైన కంఠం వరుసగా ఉదరం, ఆపైన మోకాళ్ళు, చీలమండలు, పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వామివారి తల భాగం భూమిని తాకుతూ ఉంటే పాదాలు ఆకాశం వైపు ఉంటాయి. యోగ నిద్రలో ఉన్న స్వామివారికి భంగం కలగకుండా తన మూడు నెలల పసికందును ఒడిలో పెట్టుకుని కాపలాగా అమ్మవారు ఉంటారు. జగన్మాతను అమ్మలా చూసే మహద్బాగ్యం ఇక్కడే కలుగుతుందని ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు మురిసిపోతుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ శక్తిశ్వర ఆలయంలో అనేక మహిమలు వెలుగు చూశాయి. ఆలయానికి ఎదురుగా శక్తి కుండం అనే చెరువు ఉంటుంది. ఈ ఆలయంలోని నీటితోనే స్వామివారికి నైవేద్యం వండుతారు. ఈ నీటిని కాకుండా వేరే నీటితో నైవేద్యం వండితే ఉడకదు. కొంతకాలం కిందట చెరువును తవ్వేందుకు గ్రామ పెద్దలు శక్తి కుండాన్ని ఎండబెట్టారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు వేరే నీటితో స్వామి వారి నైవేద్యాన్ని వండితే అది ఉడకకుండా అలాగే ఉండిపోయింది. అది గ్రహించిన అర్చకులు శక్తి కుండం చెరువులోని కొంత మట్టిని తొలగించి నీటిని తీసి అలా ఊరిన ఆ నీటితో వండితే నైవేద్యం ఉడికింది. ఈ శక్తి కుండంలోనికి కాశీ నుండి అంతర్వాహినిగా గంగ ప్రవహిస్తుందని కధనం. దీంతో ఈ శక్తి కుండం చెరువు గంగతో సమానమైనదిగా ప్రసిద్ధిగాంచింది. స్వామివారి అభిషేకాలకు ఈ నీటినే అర్చకులు ఉపయోగిస్తారు. శక్తికుండంలో స్నానం చేసి శక్తిశ్వర స్వామిని దర్శించుకుంటే అపమృత్యు భయాలు తొలుగుతాయని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

ఆంగ్లేయులు కంటే ముందు వచ్చిన తురుష్కులు ఆలయంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. తురుష్కుల ప్రభువు తన కత్తి పదును తెలుసుకునేందుకు ఆలయంలోని నంది విగ్రహాన్ని నరకగా ఆ విగ్రహంలో వజ్రాలు, వైడూర్యాలు బయటపడ్డాయి. నంది విగ్రహం లోనే ఇంత సంపద ఉంటే స్వామివారి విగ్రహంలో ఎంత ఉందో అంటూ విగ్రహాన్ని సమీపించగానే మండపం పై కప్పు కూలి తురుష్కుల ప్రభువు చనిపోయాడని ఆలయ చరిత్ర చెబుతోంది. మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవంలో శక్తీశ్వరుపై శ్లోకాలు రచించి, ఆలయాన్ని దర్శించి పలు సార్లు స్వామిని అర్చించినట్టు గ్రంధాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్ప ఆలయాన్ని దర్శించుకుని, స్వామి వారిని అర్చించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..