భోపాల్, జనవరి 24: మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయస్థాయి అవార్డు లభించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జనవరి 23న జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫెరెన్స్‌లో ఈ మేరకు కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేతులు మీదిగా రాష్ట్ర గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ కాంతారావు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌ల సమక్షంలో ‘అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్’ను డిఎంజి విజి వెంకటరెడ్డికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో తీసుకున్న పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంభిస్తున్న విధానాల వల్ల అనతికాలంలోనే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు. గత ఆర్ధిక సంవత్సరంలో 11 మేజర్ మినరల్స్ బ్లాక్‌లకు విజయవంతంగా ఆక్షన్ ప్రక్రియను పూర్తి చేసి, మైనింగ్ ఆపరేషన్స్‌ను ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. ఇదే విధంగా మైనింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ఆకాంక్షించారు.
గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి అవార్డును అందుకున్న సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో సీఎం శ్రీ వైయస్ జగన్ అనేక సంస్కరణలను తీసుకువచ్చారని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్ బ్లాక్‌ల్లో ఆపరేషన్స్ జరగకుండా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానంను అమలులోకి తీసుకువచ్చాని తెలిపారు.
2022-23లో 146 మైనర్ మినరల్ బ్లాక్‌లకు, 2023-24లో ఇప్పటివరకు 134 మైనర్ మినరల్స్ బ్లాక్‌లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. నాన్-వర్కింగ్ లీజులను పూర్తి స్థాయిలో వర్కింగ్ లీజులుగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అపారంగా ఉన్న మినరల్స్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అటు ప్రభుత్వానికి రెవెన్యూ, ఇటు పరిశ్రమల అవసరాలకు ఖనిజాలను సమకూరుస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా యువతకు మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో మైనింగ్ రంగాన్ని నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నమని వివరించారు. ఇందుకు సీఎం శ్రీ వైయస్ జగన్‌తో పాటు గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇస్తున్న ప్రోత్సాహమే కారణమని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..