ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కానున్నాయి. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం తిరుపతి – ఢిల్లీ ఇండిగో విమానం సర్వీసు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. త్వరలోనే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్థలాలను పరిశీలించి కొత్త ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు ఉండేవన్న రామ్మోహన్ నాయుడు.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంఖ్య 157కు చేరిందన్నారు.
తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు లేకపోవటంతో గతంలో ఈ ప్రాంతవాసులు ఇబ్బందులు పడేవారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అందుకే తిరుపతి – ఢిల్లీ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను మరింత అభివృద్ధి చేసేందుకు, మరిన్ని సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి, ముంబై, కోయంబత్తూరు, కలకత్తా నుంచి తిరుపతికి డైరెక్ట్ విమాన సర్వీసులు కావాలని డిమాండ్ పెరుగుతుందన్న రామ్మోహన్ నాయుడు.. భక్తుల కోరిక మేరకు ఆ విషయాన్ని సైతం పరిశీలిస్తామని చెప్పారు. తిరుపతి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెంచుతామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏడు విమానాశ్రయాలకు తోడు మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడుచోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలు, స్థలాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. స్థలం అందుబాటులో ఉంటే త్వరలోనే ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
ఇదిలావుంటే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. 2029 నాటి కల్లా విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్ ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పార్లమెంటు సభ్యులు బాలశౌరి చెప్పారు. దేశంలోనే మొదటి పది విమానాశ్రయాల్లో విజయవాడ విమానాశ్రయాన్ని ఒక్కటిగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పనులపై విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి కమిటీ ఛైర్మన్ హోదాలో ఎంపీ బాలశౌరి, వైస్ ఛైర్మన్ హోదాలో ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఇంటిగ్రేటెడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. అమరావతికి ప్రముఖుల రాకపోకలతో తాకిడి పెరుగుతున్నందున వీలైనంత త్వరలో నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని ఆయ అన్నారు. 2025 జనవరి నాటికి కాంక్రీటు పనులు.. అనంతరం జూన్ నాటికి గ్లాస్, ఇతర పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. పనుల్లో మరింత పురోగతి సాధించేలా వారాంతపు రివ్యూలు నిర్వహిస్తామన్నారు ఎంపీ బాలశౌరి.
సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని బాలశౌరి తెలిపారు. భద్రతకు కేంద్ర సీఐఎస్ఎఫ్ బలగాలు కేవలం 230మందిని మాత్రమే కేటాయించారు.. వాళ్లు సరిపోనందున భద్రతను మరింత పెంచమని కోరామన్నారు. వారణాసి, కొచ్చి సహా దేశం లోని ఇతర ప్రాంతాలకు, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంపుకి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు ఎంపీలు బాలశౌరి, శివనాథ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..