
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలికను ఇద్దరు యువకులు వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తామంటూ యువకులు ఒక బాలికను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలికను గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు, చిన్న కోటయ్య అనే ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. సదరు బాలిక ఎక్కడికి వెళ్లినా వెంటపడటం, మాటలతో వేధించడం వంటివి చేస్తూ ఇబ్బంది పెట్టేవారు. నిందితుల వేధింపులు శృతిమించడంతో.. బాలిక వారిని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు.. తమను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోసి చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.
తమ బిడ్డకు ప్రాణహాని ఉందని గ్రహించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే సత్తెనపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, నిందితులు కోటేశ్వరరావు, చిన్న కోటయ్యలను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను వేధించినందుకు గాను వీరిపై పోక్సో చట్టం కింద, హత్య బెదిరింపుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు.