మెరుగైన సమాజం కోసం టీవీ9 చేస్తోన్న ప్రయత్నం లోకమంతటకి తెలిసిన విషయం. టీవీ9 ఏమీ నిన్న, మొన్న పుట్టుకొచ్చిన సంస్థ కాదు. ఇంచుమించు గత రెండు దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. పరిష్కారాలను చూపిస్తూనే ఉంది. అందుకే టీవీ9 తెలుగు ప్రేక్షకుల మన్నన పొందింది. మనసు గెలిచింది. జాతీయ స్థాయిలో ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఈ మధ్య కొందరు టీవీ9పై తప్పుడు ప్రచారం చేస్తూ.. సోషల్ మీడియాలో పబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవాలు వెలికి తీస్తున్నప్పుడు గిట్టని వర్గం ఎలాగూ ఏర్పడుతుంది. వారంతా ఏకమై సమయం దొరికినప్పుడు.. సోషల్ మీడియాలో కనిపించని ముఖాలతో నానా యాగీ చేస్తున్నారు. టీవీ9 విజయపరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఇష్టారాజ్యంగా వక్రభాష్యాలు, వక్రీకరణలకు పూనుకుంటున్నారు. టీవీ9 ఆరంభం నుంచి ఇలాంటి ఆటంకాలు కొత్త కాదు. సమస్య వచ్చిన ప్రతిసారీ మేము వెన్ను చూపి పారిపోలేదు. ఎదరొడ్డి పోరాడాం. ఆధారాలతోనే సోషల్ మీడియా వారియర్స్‌కు చెక్ పెట్టాం. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుంతత్రాలు పన్నినా టీవీ9 ను తెలుగు ప్రజలు మదిలో నుంచి తీసివెయ్యలేరు. మా సుదీర్ఘ ప్రయాణంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా సరే మేము సామాన్యులవైపే గొంతెత్తాం. పాలకులు ఎవరైనా సరే.. విధానాల వైఫల్యాలను ఎత్తిచూపాం.
కృష్ణపట్నం ఆనందయ్య పసరు మందు విషయంలోనూ టీవీ9 అదే పంథాలో సాగింది. ఆనందయ్య పేరుతో పంపిణీ చేస్తున్నది కరోనా మందు కాదని ప్రభుత్వమే తేల్చేసింది. దాని వల్ల కరోనా తగ్గుతుంది అనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. నిపుణుల కమిటీ కూడా నమ్మకం ఉంటే వాడండి. గానీ ఇతర మందులు, వైద్యులను సంప్రదించే ప్రయత్నాలు మనొద్దని సలహాలు ఇచ్చింది. మాకు ఆనందయ్యపై తప్పుడు ప్రచారం చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది. ప్రజల ప్రాణాలను కాపాడటమే మా కర్తవ్యం. కేవలం ఆనందయ్య పసరు మందు మాత్రమే వాడి.. అల్లోపతి మెడిసిన్ వాడకపోతే ఏం జరుగుతుందో మారుమూల ప్రాంతాలలో ఉండే కొందరు ప్రజలకు తెలీదు. అదే విషయంపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇక్కడే జనాల ఎమోషన్‌ను టార్గెట్ చేస్తూ.. టీవీ9 తెలుగుపై తప్పుడు ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా మమల్ని బద్నాం చేసే ప్రయత్నాలతో ముందుకెళ్లారు. అయినా మేం వెరవవేదు, దడవలేదు. ముఖ్యంగా టీవీ3 న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్.. టీవీ9పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం ప్రారంభించింది. ఆనందయ్య మందుపై టీవీ9 తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కథనాలు వండివార్చింది. ఆ ఛానల్ ఎంత నీచ బుద్ది ప్రదర్శించినా కానీ మేం వాస్తవాలతో వార్తలు ప్రసారం చేశాం. నిపుణులు అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. మేం వాదించడం లేదు వాస్తవాలను వెలికితీస్తున్నాం. మాకు మేం గెలవాలన్న తాపత్రయం లేదు. ఏది కరెక్టో అదే చెప్పాలనుకున్నాం. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా టీవీ9 తెలుగు మీతో ఉంటుంది. మీ ఇంట ఉంటుంది. మీ మదిలో ఉంటుంది.