టీవీ9 ఎఫెక్ట్: స్వర్ణాభరణాలతో శ్రీ అరసవల్లి సూర్య భగవానుడి సాక్షాత్కారం, పరవశించిపోయిన భక్తజనం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీకాకుళం శ్రీ అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో రధసప్తమి పర్వదినాన ఆ స్వామి వారి నిజరూప దర్శనం కోసం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీకాకుళం శ్రీ అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో రధసప్తమి పర్వదినాన ఆ స్వామి వారి నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు పరితపించి పోతుంటారు.. ఏడాదికి రెండు పర్యాయాలు మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షణాయనానికి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి స్ధాన చలనం చెందే మూడు రోజుల పాటు ఆలయంలోని గర్భగుడిలో కొలువు దీరిన మూల విరాట్ కు ఉదయించే లేవలేత కిరణ స్పర్శ జరిగే అద్భుత దృశ్యం చూసేందుకు భక్తులు ఆరాటపడతారు… అంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ దేవాలయంలో ఇరవై ఏళ్ల అనంతరం ఆస్వామి వారికి స్వర్ణ ఆభరణాల అలంకరణ శోభను తిలకించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాసి, ఆ స్వర్ణ తేజోభిలాసుడిని కనులారా వీక్షించి పర్వశించిపోయారు. దశాబ్దాల తరబడి ఆ అలంకారానికి నోచుకోని ఆ సూర్య భగవానుడి స్వర్ణ ఆభరణ అలంకార మహోత్సవాన్ని ఇవాళ కనులారా తిలకించారు.
ఇలాఉంటే, శ్రీకాకుళంజిల్లా అరసవల్లిలో కొలువు దీరిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామికి కిలోల కొలిది బంగారం ఆభరణాలు వున్నా అలంకారానికి నోచుకోని పరిస్థితి ఇంతకాలం నెలకొంది. అనేక కారణాలతో ఆ ఆభరణాలన్ని బ్యాంకు లాకర్లకే పరిమితం చేయడంతో, వాటిని ఆ లాకర్ల నుంచి బయటకు తెచ్చి స్వామి వారికి అలంకరించేందుకు దేవాదాయ, పాలక మండలి సభ్యులు, దాతలు, ఆలయ అర్చక వంశపారంపర్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ ఆభరణాలు అలంకరణకు నోచుకోలేదు. మరో వైపు అందరూ సమ్మతించినా భద్రత కల్పించలేమని పోలీసులు కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడంతో ఆ స్వామి వారికి ఆ స్వర్ణ ఆభరణాల అలంకరణ నోచుకోలేదు. అయితే, ఈ అంశంపై గత కొన్నాళ్లుగా టీవీ9 పలు కథనాలను ప్రసారం చేయడంతో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దేవాదాయ శాఖ ఎట్టకేలకు ఆ స్వామి వారి స్వర్ణ ఆభరణాలను అలంకరించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో కార్తీక పౌర్ణమి, ఏకాదశి పర్వదినాన ఆ బంగారు ఆభరణాలను స్వామి వారికి అలంకరించేందుకు దేవాదాయ శాఖ నిర్ణయించింది. దీంతో గత రాత్రి బ్యాంకు లాకర్ల నుంచి తెచ్చిన సుమారు పది కిలోల బంగారు ఆభరణాలను తెల్లవారుజాము నుంచి వేదపండితులు స్వామి వారి మూల విరాట్ కు అలంకరించి భక్తులకు దర్శించేందుకు స్వామి వారిని ముస్తాబు చేశారు. ఆ స్వామి వారికి స్వర్ణ ఆభరణాల అలంకరణ చేస్తున్నారని ఇప్పటికే ప్రచారం జరగడంతో ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు ఈ తెల్ల వారు జాము నుంచే ఆలయానికి బారులు దేరి ఆ స్వర్ణ ఆభరణాల అలంకరించుకున్న సూర్య భగవానుడుని చూసి పరవశించి పోయామని తన్మయత్వం చెందారు భక్తులు.