తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఆపద మొక్కుల స్వామికి కానుకలు సమర్పించే భక్తులు తిరుమలేశుడి ఆస్తుల విలువను పెంచుతున్నారు. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా గత నాలుగేళ్లలో శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది.
2019 జూన్‌కు ముందు తిరుమలేశుడికి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్‌లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో గురువారం మీడియా సమావేశం విర్వహించిన ఈఓ ధర్మారెడ్డి టీటీడీకి ఉన్న 24 బ్యాంకు ఖాతాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాలను వెల్లడించారు. 2019 జూన్ 30 వరకు రూ. 13025.09 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా, 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 17,816.15 కోట్లకు చేరుకున్నాయి. దీంతో గత నాలుగేళ్లలో శ్రీవారి ఆదాయం బ్యాంక్‌ల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ. 4791.06 కోట్లకు పెరిగింది.
ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగా పెరిగాయి. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన ఈఓ 2019 జూన్ 30 వరకు 7339.74 కేజీలు ఉండగా 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్‌లుగా ఉంది. గత నాలుగేళ్లలో 3885.92 కేజీల బంగారం అదనంగా శ్రీవారి పేరుతో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీల గోల్డ్‌నుటీటీడీ డిపాజిట్ చేసింది.
టీటీడీ పాలన, శ్రీవారి ఆస్తులపై పలు ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేసిన టీడీపీ నేతల కామెంట్స్ పై స్పందించిన టిటిడి ఈవో బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారు డిపాజిట్లు వివారాలు ప్రకటించాల్సి వచ్చింది. టీటీడీ పాలనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలను కూడా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చర్చకు ఆహ్వానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..