Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. ..

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
TTD Rathasapthami 2026

Edited By:

Updated on: Jan 22, 2026 | 10:27 PM

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయన్నారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల 50వేల మంది వస్తారని అంచనా వేశారు. ఈ రద్దీ దృష్ట్యా తిరుపతిలో 24 నుంచి 26 వరకు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. మాడవీధుల్లో 3,700 మంది శ్రీవారి సేవకుల సాయంతో 14 రకాల వంటకాలతో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ర‌థ స‌ప్తమి రోజున శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బ‌య‌ట ప్రాంతాల్లో నిరంత‌రాయంగా భ‌క్తుల‌కు అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను ఆదేశించారు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు. భ‌ద్రత‌కు పెద్ద పీట వేయాల‌ని, టీటీడీ భ‌ద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం స‌మ‌న్వంయంతో ప‌టిష్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. 1,260 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భక్తులకు భద్రతా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల ద్వారా 2,300 ట్రిపులు నడిచేలా ప్రణాళికలు రూపొందించారు. వాహనసేవల ముందు 56 కళా బృందాలతో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో టీటీడీ అధికారులతో కలిసి బీఆర్‌ నాయుడు తనిఖీలు చేశారు. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తుల సౌకర్యాలపై టీటీడీ, విజిలెన్స్ అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు.