
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ (సర్వదర్శన) టోకెన్ల జారీలో తాత్కాలిక మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద బుధవారం భక్తులకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అయితే, శుక్రవారం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా జారీ చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
శ్రీవారి సేవను గ్రామస్థాయిలో మరింత విస్తరించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోందని టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. రవిచంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
మంగళవారం తిరుపతిలోని శ్రీవారి సేవాసదన్‌లో గ్రూప్ సూపర్‌వైజర్లకు నిర్వహించిన రెండో విడత శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈవో, శ్రీవారి సేవను మరింత సమర్థవంతంగా విస్తరించేందుకు గ్రూప్ సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల ఆలయాలు ఉన్నాయని, వాటిలో శ్రీవారి సేవను విస్తరించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశాలను గుర్తించి టీటీడీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అలాగే, శ్రీవారి సేవకుల పనితీరును అంచనా వేసి, సిబిల్ స్కోర్ తరహాలో ప్రత్యేక రేటింగ్ వ్యవస్థను అమలు చేయాలని టీటీడీ యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఆ రేటింగ్ ఆధారంగానే సేవకులకు భవిష్యత్తులో విధులు కేటాయించే విధానాన్ని తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ సూపర్‌వైజర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన ఈవో, శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్, చెన్నైకు చెందిన శరత్‌లను సత్కరించారు. కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డా. టి. రవి, పీఆర్వో నీలిమ తదితరులు పాల్గొన్నారు.