విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఒకరు దైవ దర్శనానికి వెళ్లి సరదాగా విహారానికి వెళితే.. మరొకరు సహచరుడితో వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేద్దామని వచ్చారు. అక్కడ సరదాగా జలకాలాడుతుండగా.. ఓ యువకుడు కాలుజారి నీటిలోకి వెళ్లిపోయాడు. అక్కడే సహచరుడుతో ఉన్న మరో నేవి ఉద్యోగి.. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఫలించలేదు సరి కదా నేవీ ఉద్యోగి కూడా కొట్టుకుపోయాడు. అతని సహచరుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరాడు. అరకులోయ ఏజెన్సీలోని సరియా జలపాతం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
అనంతగిరి ఎస్సైలు మల్లేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బాబామెట్టా ప్రాంతానికి చెందిన లంకా సాయికుమార్.. తమ ముగ్గురు స్నేహితులతో కలిసి విశాఖలోని దైవ క్షేత్రాల సందర్శనకు బయలుదేరాడు. సాయికుమార్ పైడి భీమవరంలోని మెడికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. సెలవులతో సరదాగా స్నేహితులతో బయలుదేరాడు. అక్కడి నుంచి అరకు ఏజెన్సీకి వెళ్లారు. అనంతగిరి మండలం సరియా జలపాతం వద్దకు వెళ్లి సరదాగా గడిపారు.
ఇంతలో.. సాయికుమార్ ప్రమాదవశాత్తు జలపాతంలోకి జారి పడిపోయాడు. మునిగిపోతుండగా.. సహచరులు కేకలు పెట్టారు. దీంతో అప్పటికే తన సహచరుడితో విహారానికి వచ్చిన మరో బ్యాచ్ లో నేవీ ఉద్యోగి చూసి కాపాడేందుకు ప్రయత్నంచాడు. తన సహచరుడుతో కలిసి దీపక్ కుమార్ నీటిలోకి దూకారు. అయితే.. సాయికుమార్ రక్షించే ప్రయత్నం ఫలించకపోగా.. అదే జలపాతంలో నేవి ఉద్యోగి దీపక్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. ప్రమాదకరంగా నీరు ప్రవహించడంతో.. ప్రాణాపాయం నుంచి దీపక్ కుమార్ సహచరుడు ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సాయి కుమార్ భార్య ప్రస్తుతం గర్భిణీగా ఉన్నారు. ఇక బీహార్‌కు చెందిన నేవీ ఉద్యోగి దీపక్ కుమార్ విశాఖలో పనిచేస్తున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..