
కలియుగ ప్రత్యక్ష దైవంగా అందరూ భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది భక్తులు కోండపైకి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రోజూ 70 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం టీటీడీ కల్పిస్తుండగా.. హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. కల్తీ లేని ఆహార పదార్ధాలు భక్తులకు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో తిరుమలలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(FSSAI) ల్యాబ్ ఏర్పాటు చేయనుంది. కేంద్రంతో పాటు ఏపీ ఆరోగ్య భద్రతా విభాగంతో కలిసి టీటీడీ ఈ ల్యాబ్ ఏర్పాటుకు రెడీ అయింది. ఈ ల్యాబ్ ద్వారా కల్తీ లేని నాణ్యమైన ఆహారం భక్తులకు అందేలా చేయనుంది.
అతి తక్కువ మోతాదులో ఆహారం కల్తీ జరిగినా ఈ ల్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు. అతి సౌక్ష్మస్థాయిలోని కల్తీని కూడా గుర్తించే అవకాశం లభించనుంది. మొత్తం 15 పరికరాలు ఈ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్‌లో అందుబాటులో ఉంటాయి. హై ఫర్‌ఫార్మెన్స్ లిక్విడ్ క్రమోగ్రాఫ్, గ్యాస్ క్రొమటోగ్రాప్, ఐసీపీఎంసీ వంటి 15 రకాల పరికరాలు అమర్చనున్నారు. ఈ పరికరాల ద్వారా ఆహార కల్తీని ఈజీగా గుర్తించవచ్చు. మార్చి నుంచి ఈ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. టీటీడీ ఇప్పటికే తిరుమలలో నీరు, ఆహార పదార్థాల నాణ్యత తెలుసుకునేందుకు ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌కు సమీపంలోనే కేంద్ర ప్రభుత్వ సహాకరాంతో ఈ కొత్త ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కేంద్ర కొత్త ల్యాబ్ కోసం రూ.20 కోట్లతో కొత్త పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేసింది. వీటిని ఈ ల్యాబ్‌లో అమర్చుతున్నారు.
తాజాగా ఈ ల్యాబ్‌ను టీటీడీ ఇంచార్జ్ ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ల్యాబ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గత కొద్ది నెలలుగా ఈ అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. ఇప్పటికే సిట్ విచారణ చేపడుతోంది. తిరుమలకే కాకుండా శ్రీశైలం ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ గుర్తించింది. 2022 నుంచి 2023 వరకు కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ చెబుతోంది. అప్పటివరకు శ్రీశైలంకు విజయ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. కానీ ఆ తర్వాత తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. అయితే ఈ నెయ్యిలో కొన్ని రసాయనాలు కలిసినట్లు సిట్ చెబుతోంది.