శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) నుండి విచ్చేసిన అధికారులు, టిసిఎస్, జియో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటి అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి UIDI అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు.
ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు యుఐడిఎఐ అధికారులు ఆధార్‌ను ఏ విధంగా అప్లికేషన్‌లకు లింక్ చేయవచ్చు, తదితరాంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు
శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై, అందుకు తీసుకోవలసిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు.
తరువాత ప్రముఖ డైరీ నిపుణులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, అగ్ మార్క్, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. నాణ్యమైన నెయ్యి ప్రామాణిక విలువల గురించి వారు తమ పిపిటిలో తెలిపారు. త్వరలో లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యి సమకూర్చుకోవడానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..