TTD: తిరుమల కొండపై కొని తినే వ్యవస్థ ఉండకూడదు. ఆ భగవంతుడి ముందు అందరూ సమానమే. ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడి వరకు అందరికీ
ఒకే రకమైన అన్నప్రసాదం అందాలి. TTD తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. మరి ప్రైవేట్ ఫుడ్ వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం సాధ్యమేనా? క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది?
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లకు విపరీతమైన డిమాండ్. ప్రతిరోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లను అద్దె ప్రాతిపాదికన టెండర్ల ద్వారా కేటాయిస్తుంది TTD. కొండపై 7 పెద్ద రెస్టారెంట్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. ఇక ఫాస్ట్‌పుడ్ సెంటర్లయితే వందకుపైనే ఉంటాయి. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో రద్దీ కారణంగా బయట భోజనం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అందుకే ప్రైవేట్ హోటళ్లకు డిమాండ్ భారీగా ఉండటంతో రేట్లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఈ దోపిడీపై టీటీడీకి తరుచూ ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. అందుకే ఈ వ్యవస్థపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.
తిరుమల్లో హోటళ్ల నియంత్రణపై టీటీడీ పాలకమండలి విస్తృతంగా చర్చించింది. భోజనం కొని తినే పరిస్థితి ఉండకూడదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అసలు ప్రైవేట్ హోటళ్లు అనేవే లేకపోతే.. వచ్చే భక్తులందరికీ భోజనాన్ని సరఫరా చేసే సామర్థ్యం ఉందా అనే అంశంపై వివరణ కోరారు. అధికారులు కూడా ఓకే చెప్పడంతో…ప్రైవేట్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలని డిసైడ్ అయ్యింది టీటీడీ. ప్రస్తుతం అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 70 వేల మంది ప్రసాదం స్వీకరిస్తున్నారు. రోజుకు లక్షా 50 వేల మందికి అన్నప్రసాదం సరఫరా చేయగలిగే వ్యవస్థ టీటీడీ వద్ద ఉంది. పూర్తిస్థాయిలో హోటళ్లను మూసివేస్తే రోజుకు సగటున 3 లక్షల మందికి భోజనాలు అందించాల్సి ఉంటుంది. మరికొంత మ్యాన్‌పవర్‌ను సమకూర్చుకుంటే ఉచిత భోజనాలను అందించడం పెద్ద విషయం కాదు.
ప్రస్తుతం ఉన్న పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఇతర ట్రేడ్ లైసెన్సులు కేటాయిస్తే వారి నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే యజమానులతో ఆ దిశగా మాట్లాడారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 35 ఏళ్ల క్రితం టీటీడీ ప్రారంభించిన నిత్య అన్నదానం పథకానికి సుమారు 1400 కోట్లు నిధులున్నాయి. వాటి ద్వారా వచ్చే వడ్డీతో అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం యేటా వంద కోట్లకుపైగా ఖర్చవుతోంది. ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాద పంపిణీ జరుగుతుంటుంది. ప్రైవేట్ ఫుడ్‌ను పూర్తిగా ఎత్తివేస్తే ఉచిత అన్నప్రసాద పంపిణీ ఖర్చు మరింత పెరగనుంది.
ఇవి కూడా చదవండి: