Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ అద్భుత అవకాశం.. క్యూఆర్ కోడ్‌ సేవలు..

తిరుమల శ్రీవారి భక్తులకు మంచి అవకాశం కల్పిస్తోంది టీటీడీ. కొండపై పాదరక్షలు ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల తర్వాత అవి కనిపించడం లేదు. ఈ క్రమంలో టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత సిస్టమ్ తీసుకొచ్చింది. దీని వల్ల భక్తులు సులువుగా తమ పాదరక్షలు భద్రపర్చుకోవచ్చు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ అద్భుత అవకాశం.. క్యూఆర్ కోడ్‌ సేవలు..
Tirumala

Updated on: Feb 19, 2026 | 7:41 AM

తిరుమల శ్రీవారి భక్తుల ఇబ్బందులను తీర్చేందుకు టీటీడీ అనేక కొత్త సదుపాయాలు కల్పిస్తోంది. రోజూ కొండపైకి వచ్చే లక్షలాది మంది భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు పాదరక్షలు ఎక్కడ భద్రపర్చుకోవాలనేది తెలియదు. దీంతో చాలామంది భక్తులు రోడ్ల పక్కనే ఎక్కడికక్కడ వదిలేస్తూ ఉంటారు. ఈ పాదరక్షలు భద్రపర్చుకునేందుకు టీటీడీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. డిపాజిట్ చేయాలన్నా.. లేదా తీసుకోవాలన్నా వేచి ఉండాల్సి వస్తుంది. దీని వల్ల సమయం వృధా అవుతుంది. దీంతో భక్తులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సరికొత్త టెక్నాలజీ వ్యవస్థను టీటీడీ ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగా క్యూఆర్ ఆధారిత స్మార్ట్ ఫుట్‌వేర్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది.

త్వరలో మరిన్ని కౌంటర్లు

క్యూఆర్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ల ద్వారా భక్తులు సులభంగా తమ పాదరక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే తిరిగి వెంటనే తీసుకోవచ్చు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. భక్తులకు ఈ సౌకర్యం ఎంతగానే ఉపయోగపడుతుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ విధానం ప్రవేశపెట్టగా.. ప్రస్తుతం ఇలాంటివి కొన్ని కౌంటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు టీటీడీ రెడీ అవుతోంది. త్వరలోనే కళ్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కూడా ఈ స్మార్ట్ పాదరక్షల కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. కోరమాండర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహాకారంతో వీటిని నడుపుతున్నారు.

భక్తులకు తప్పిన తిప్పలు

తిరుమలలో భక్తులు ఎక్కడికక్కడ పాదరక్షలు వదిలేస్తున్నారు. దీని వల్ల అవి కనిపించకుండా పోవడంతో పాటు కొండపై అపరిశుభ్రత ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టడంతో పాటు భక్తులకు సౌకర్యం మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఇది ప్రవేశపెట్టాక తిరుమలలో పరిశుభ్రత కూడా పెరిగిందని టీటీడీ తెలిపింది. ఇప్పటివరకు 8,45,816 మంది ఈ విధానాన్ని ఉపయోగించుకున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. కొంతమంది భక్తులకు అవగాహన లేకపోవడం వల్ల ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఈ మేరకు తిరుమలలో ప్రచారం కల్పిస్తోంది. వీటి వల్ల పాదరక్షలను భద్రపర్చుకునే సెంటర్లకు కూడా రద్దీ తగ్గింది.

Follow Us