
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శనంకు సంబంధించి మరో అవకాశం కల్పిస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇప్పుడే అనేక రకాల టికెట్లు, సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300, దివ్య దర్శనం, సర్వదర్శనం, సుపథం, టైం స్లాట్ టోకెన్స్, లక్కీ డిప్ వంటి టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక రూ.300 టికెట్లు, లక్కీ డిప్ వంటి టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే టికెట్లు ఖాళీ అవుతాయి. అయితే టికెట్లు దొరకనివారు మరో రకంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
తిరుమల శ్రీవారిని మరో రకంగా కూడా టికెట్ తీసుకుని దర్శించుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. అదే తిరుమల దివ్యానుగ్రహ హోమం. మార్చి నెలకు సంబంధించి ఈ సేవల టికెట్లను ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం జరుగుతోంది. ఇందులో పాల్గొన్నవారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. ఇక టికెట్ కింద ఇద్దరు దర్శనానికి వెళ్లవచ్చు. హోమం జరిగిన రోజే మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం టీటీడీ కల్పిస్తోంది.
దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ధర రూ.1600గా టీటీడీ నిర్ణయించింది. మొత్తం 200 టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. హోమం ముగిసిన అనంతరం అదే టికెట్‌పై ఇద్దరికి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు దొరకని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. టీటీడీ కల్పిస్తున్న ఈ అవకాశం గురించి చాలామందికి అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.