
తిరుమల ఫిబ్రవరి 24, 2025: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు.. హుండీలో భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ప్రతి రోజూ భక్తులు సమర్పించుకునే కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు రూ.3 కోట్ల – 4 కోట్ల హుండీ ఆదాయం వస్తోంది. ఒక్కో నెలలో దాదాపు రూ.110-120 కోట్ల మేర ఆదాయం వస్తోంది. అంటే ఏడాదికి రూ.1,300 కోట్ల మేర హుండీ ఆదాయం వస్తోంది.
దీంతో పాటు టీటీడీ అధికారులను ప్రముఖ సంస్థలకు చెందిన ప్రముఖులు, భక్తులు నేరుగా కలిసి భారీ విరాళాలు అందజేస్తున్నారు. టీటీడీ ఆధీనంలో నడుస్తున్న వివిధ సంస్థల కోసం ఈ విరాళాలను అందజేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీనివాసులు రెడ్డి టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ (SV Pranadhanam Trust) కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కలిసి డిడిని అందించారు. ఈ సారి రూ.10 లక్షల విరాళం అందజేసిన భక్తుడు శ్రీనివాసులు రెడ్డి గతంలోనూ తన ఉదారతను చాటుకున్నారు.
గతంలో టీటీడీలోని వివిధ పథకాలకు సదరు దాత శ్రీనివాసులు రెడ్డి రూ.30 లక్షలను విరాళంగా అందజేశారు. ఈరోజు ఇచ్చిన రూ.10 లక్షలతో కలిపి మొత్తంగా శ్రీవారికి రూ. 40 లక్షలు అందించినట్లు అయింది. విరాళంగా అందించిన దాత శ్రీనివాసులు రెడ్డిని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు.
గుండె, కిడ్నీ, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించే లక్ష్యంతో టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ పనిచేస్తోంది. ఆ రోగాలకు సంబంధించిన పరిశోధన కార్యకలాపాలు కూడా చేపడుతున్నారు. ఈ ట్రస్ట్‌కు గత ఏడాది ఆగస్టులో పంజాబ్‌కు చెందిన పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా అనే భక్తుడు రూ.21 కోట్ల భారీ విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకోవడం విశేషం.