Tirumala News: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు.. దర్శనానికి 17 గంటల సమయం..

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 11:52 AM

గోవింద నామస్మరణతో తిరుగిరులు మారుమోగిపోతున్నాయి. తిరుమల(tirumala) లగేజీ కౌంటర్ దగ్గర నుంచి.. శ్రీవారి ప్రధానాలయం వరకు.. ఎక్కడ చూసినా భక్తులే. తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది...

Tirumala News: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు.. దర్శనానికి 17 గంటల సమయం..
Tirumala
Follow us on

గోవింద నామస్మరణతో తిరుగిరులు మారుమోగిపోతున్నాయి. తిరుమల(tirumala) లగేజీ కౌంటర్ దగ్గర నుంచి.. శ్రీవారి ప్రధానాలయం వరకు.. ఎక్కడ చూసినా భక్తులే. తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్ల దగ్గర నుంచి రాంభగీచా వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు(Devotees) ఉన్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 17 గంటల సమయం పడుతోంది. పెరిగిన భక్తుల రద్దీతో శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌(Laddu Counter), కాటేజీలు, బస్టాండ్‌, అన్నప్రసాద భవనం సహా తిరుమల గిరులన్నీ రద్దీగా మారాయి.

గదులకు డిమాండ్‌ కొనసాగుతోంది. సీఆర్వో, ఎంబీసీ, గదుల రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో గదిని పొందేందుకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు కల్యాణకట్టలు కూడా యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడం.. విద్యార్థులకు సెలవు రోజులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రెండేళ్లుగా పరిమిత సంఖ్యలోనే దర్శనాలకు అనుమతివ్వడంతో ఎప్పుడెప్పుడు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటామా అని తపించిపోయారు భక్తులు. ఇప్పుడు కరోనా కాస్త తగ్గడం, సర్వదర్శనాలకు అనుమతివ్వడంతో కొండపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డ్‌ స్థాయిలో వస్తోంది.