Tirupati: ఇకపై తిరుపతి కొత్త బస్టాండ్.. రంగంలోకి దిగిన కేంద్రం
తిరుపతి బస్టాండ్ ఆధునిక హంగులను సంతరించుకోనుంది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలతో NHLM కమిటీ బృందం తిరుపతి బస్టాండ్‌లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తితో..
తిరుపతి బస్టాండ్ ఆధునిక హంగులను సంతరించుకోనుంది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలతో NHLM కమిటీ బృందం తిరుపతి బస్టాండ్‌లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి NHLM కమిటీ సీఈవో ప్రకాష్‌గౌర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా తిరుపతి బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో వసతులు, సౌకర్యాలను కమిటీ బృందానికి వివరించారు ఎంపి గురుమూర్తి.
గత ఏడాదే కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా బస్టాండ్ పనులు నిలిచిపోయాయి. డిజైన్స్‌లో మార్పులు, చేర్పులతో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సిఎం జగన్ కారకులని, కేంద్ర మంత్రి గడ్కారీకి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామన్నారు. ఎన్డీఎ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా డిజైన్స్ ఆమోదించి టెండర్లు పిలవాలని సూచించారు ఎంపీ గురుమూర్తి. కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ బస్టాండ్ నిర్మాణానికి అవసరం అన్నారు.
నూతన బస్టాండ్ డిజైన్స్ పై త్వరలో సిఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇస్తామని NHLM సీఈవో ప్రకాష్‌గౌర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. మూడేళ్లలో నూతన బస్టాండ్‌ను పూర్తి చేస్తామన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్‌ను నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మాణం జరుగుతుందన్నారు ప్రకాష్ గౌర్. భక్తులు సేదతీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని, ఫుడ్ కోర్టులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయన్నారు ప్రకాష్ గౌర్.