Kalahasthi Bank Robbery: తిరుపతి శ్రీకాళహస్తిలోని ఫిన్ కేర్ బ్యాంక్ చోరీ కేసులో మొదటి నుంచి అందరూ అనుకున్నదే జరిగింది. ఇంటి దొంగలే అసలు దొంగలు అని తేల్చారు పోలీసులు. దోపిడీపై ఫిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగ అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ చోరీ కేసులో ఇంటి దొంగల పాత్రపై ముందు నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు బ్రాంచ్ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతున్న స్రవంతి ఈ కేసులో అసలు దోషి అని తేల్చారు పోలీసులు. గిల్టు నగలు తాకట్టు పెట్టి బంగారు రుణాలు కాజేసిన స్రవంతి.. ఆడిట్‌లో వ్యవహారం బయటపడుతుందని దొంగతనం డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు.
ఈ చోరీకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకు మేనేజర్‌గా ఉన్న స్రవంతి.. గిల్టు నగలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంది. అయితే, ఈ విషయం ఆడిట్‌లో తెలిసిపోతుందని భయపడిపోయింది. ఈ క్రమంలోనే దొంగతనం ప్లాన్ వేసింది స్రవంతి. చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని బ్యాంకు దోపిడీకి పక్కా ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌ను అమలు చేశారు యువకులు. బ్యాంక్ లాకర్ నుంచి 67 ప్యాకెట్లలోని దాదాపు రెండు కేజీల బంగారం, రూ. 5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే, తన చేతులు కట్టేసి, అరవకుండా నోటిలో గుడ్డ కుక్కి కత్తితో బెదిరించి చోరీ చేశారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, స్రవంతి ప్రవర్తనలో తేడా ఉండటంతో.. పోలీసులు ఆమెను ముందు నుంచీ అనుమానిస్తూ వచ్చారు. ఈమేరకు దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు రాబట్టారు. ఈ చోరీ కేసులో అసలు నిజాన్ని స్రవంతి నుంచే రాబట్టి రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. కాగా, గత నాలుగేళ్లుగా ఫిన్ కేర్ బ్యాంక్‌లో పని చేస్తున్న స్రవంతి.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను పని చేస్తున్న బ్యాంక్‌కు కన్నం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న స్రవంతి సహా, చోరీకి పాల్పడ్డ దుండుగలను సోమవారం నాడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.