Tirupati MP Gurumurthy: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి (Tirupati) ఎంపీ గురుమూర్తికి ఐదు కోట్ల రూపాయల రుణం మంజూరైందని ఫేక్ కాల్ చేసిన యువకుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. శుక్రవారం రూ. 5 కోట్ల రుణం మంజూరైందంటూ.. ఓ ఆగంతకుడు ఎంపీ గురుమూర్తి (MP Gurumurthy) కి కాల్ చేశాడు. తాను అభిషేక్ అని.. సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానంటూ ఎంపీతో చెప్పాడు. 20 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల మేర రుణం మంజూరు అయిందని.. లోన్ మొత్తంలో 5శాతం చొప్పున 1.25 లక్ష రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలని బ్యాంకు ఖాతా వివరాలను అభిషేక్ ఎంపీ గురుమూర్తికి పంపించాడు.
దీనిపై అనుమానం వచ్చిన ఎంపీ గురుమూర్తి అభిషేక్ ఫోన్ కాల్ పై సిఎమ్ఓ కార్యాలయంతోపాటు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో ఆరా తీశారు. అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని ఇరు కార్యాలయాల అధికారులు తెలిపారు. దీంతో ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్న ఎంపీ గురుమూర్తి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎంపీ గురుమూర్తి ఎస్పీని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ యువకుడితోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరూ ఇంకా ఎవరెవరికీ ఫోన్ చేశారు.. ఎంతమందిని మోసం చేశారన్న విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: