AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి లడ్డు కల్తీ కేసు: విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరణ – ఏపీలోనే కొనసాగనున్న ట్రయిల్!

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలకు మార్చాలని కోరుతూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నాయకుల బహిరంగ ప్రకటనలపై ఇప్పటికే నియంత్రణ ఉంచామని, విచారణ యథావిధిగా ఏపీలోనే కొనసాగుతుందని కోర్టు తేల్చిచెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరుపతి లడ్డు కల్తీ కేసు: విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరణ – ఏపీలోనే కొనసాగనున్న ట్రయిల్!
Tirupati Laddu Controversy
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2026 | 4:55 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలకు మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, విచారణ ఏపీలోనే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

పిటిషన్ వెనుక ప్రధాన వాదనలు ఏమిటి?

తిరుపతి లడ్డు కల్తీ కేసుకు సంబంధించి నిందితుడైన మహారాష్ట్రకు చెందిన డైరీ వ్యాపారి మచ్ఛింద్ర శాంతరామ్ లంకే తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఈ అంశంపై రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వరుసగా ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల నిష్పక్షపాత విచారణకు అనుకూలమైన వాతావరణం లేదని ఆయన తెలిపారు. చాలా మంది నిందితులు ఉత్తర భారతదేశానికి చెందినవారమని, భాషా సమస్యతో పాటు రాష్ట్రంలో రాజకీయ ప్రతికూలత ఉందని పేర్కొంటూ విచారణను సమీప రాష్ట్రానికి మార్చాలని కోరారు.

సుప్రీంకోర్టు స్పందన, తీర్పు

ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. రాజకీయ నాయకుల బహిరంగ ప్రకటనలపై గతంలోనే కోర్టు తగిన ఆదేశాలు జారీ చేసిందని, మా ఆదేశాలతో వారందరినీ కట్టడి చేశాం అని స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో చాలామంది సాక్షులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారని, కేసును వేరు ప్రాంతానికి మారుస్తే విచారణ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా, సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో ఈ విచారణ పారదర్శకంగా జరుగుతోందని గుర్తుచేసింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత దశలో విచారణను వేరే రాష్ట్రానికి మార్చడానికి తగిన కారణాలు ఏవీ కనిపించడం లేదని స్పష్టం చేస్తూ ధర్మాసనం పిటిషన్‌ను అధికారికంగా డిస్మిస్ చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి కోర్టును ఆశ్రయించడానికి వెసులుబాటు ఉంటుందని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

వివాదం నేపథ్యం

గతంలో తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, ధార్మిక దుమారానికి దారితీశాయి. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు పారదర్శకత కోసం సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా విచారణ బదిలీ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేయడంతో, ఈ కేసు తదుపరి విచారణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us