
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం (జూన్ 17) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని, రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు స్థానిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.