
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల క్రింద, పొలాలు, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు మంగళవారం 8 మండలాల్లో తీవ్రవడగాలులు, 13 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురంమన్యం జిల్లాలోని గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాలు,పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, విజయనగరం జిల్లాలోని బాడంగి,మెరకముడిదాం, తెర్లాం,వంగర మండలాలు,పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, భామిని,పోలవరం జిల్లాలోని దేవిపట్నం, ఎటపాక, వరరామచంద్రాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ, సీతానగరం, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. బుధవారం మొత్తంగా 14 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. సోమవారం కడప(జి) ఒంటిమిట్ట, ఖాజీపేటలో 42.5°C, కర్నూలు(జి) లద్దగిరి 41.3°C, అనంతపురం(జి) యల్లనూరు, పాతకొత్తచెరువు, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 40.5°C, మార్కాపురం(జి) పిటికాయగుల్ల, నంద్యాల(జి) గుల్లదుర్తిలో 40.3°C, తిరుపతి(జి) నాగలాపురంలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.