విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు(Exams) వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. అందరి కంటే బాగా చదవాలి, మొదటి స్థానంలో నిలవాలన్న టార్గెట్లలతో సతమతమవుతున్నారు. శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. కానీ పరీక్షలు అనే సరికి భయాందోళనకు గురవుతున్నారు. సరిగ్గా రాయలేదనో, అంచనాలను అందుకోలేకపోయమనో, ర్యాంక్ రాలేదనో, పాస్ అవలేదనో ఇలా ఎన్నో కారణాలతో విద్యార్థులు.. తమ నిండు జీవితాన్ని ముగించేస్తున్నారు. వైఫల్యాలు ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. కన్నవారికి తీరని కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. అంతేకాదు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నేకొత్తపల్లిలో ఉరి వేసుకుని ఓ విద్యా్ర్థిని, పామిడి మండలం కట్టకిందపల్లిలో విష గుళికలు తాగి మరో విద్యార్థిని, నల్లచెరువు మండలానికి చెందిన ఓ విద్యార్థిని అన్నమయ్య జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. కనగానపల్లి మండలం కుర్లపల్లితండాలో ఫినాయిల్ తాగి ఓ విద్యార్థి.. చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదిండికి చెందిన మరో విద్యార్థిని రసాయన ద్రావకం తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
(పరీక్షల ఫలితాలు విద్యార్థుల సాధనను తెలుసుకునేందుకే.. ఇవి వారి జీవితాలను ఏ మాత్రం నిర్ణయించేవి కావు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలి. పరీక్షా ఫలితాల పట్ల మానసిక ఒత్తిడికి మీరు గురవుతుంటే మానసిక వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి