
బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది గన్నవరం విమానాశ్రయం. నిత్యం వేల మంది ప్రయాణించే ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గోల్డ్ స్మగ్లింగ్‌కు కేంద్రంగా మార్చేశారు అక్రమార్కులు. ఇక ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలో 2 కేజీల పైగా బంగారం పట్టుబడటం దేనికి సంకేతం.? కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా బంగారం స్మగ్లింగ్ చేయడం వెనుక బంగారం తరలింపు ముఠాలు ఉన్నాయా.? అసలేం జరుగుతోందో.. ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల అక్రమంగా బంగారం తరలిస్తు పట్టుబడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్నవరం విమానాశ్రయాన్ని అడ్డాగా చేసుకుని బంగారం తరలింపు ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇటీవల రెండు రోజుల వ్యవధిలో రెండు కేజీల పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటాన్ని చూసి నివ్వెరపోతున్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసిన కస్టమ్స్ అధికారులు ఒకప్పుడు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలకు పరిమితమైన బంగారం అక్రమ తరలింపు ముఠాలు.. ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను కూడా అడ్డాగా చేసుకున్నాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ సర్వీసులు తక్కువగా ఉండటం.. పైగా చెకింగ్ కూడా ఎక్కువగా ఉండకపోవడం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను అడ్డాగా చేసుకుని బంగారం తరలింపు ముఠాలు తెర వెనుక పని చేస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన అధికారులు.. అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడంతో బంగారం తరలిస్తున్న వారి గుట్టు రట్టయింది.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు మహిళలను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. షార్జా నుంచి ఫ్లైట్‌లో వచ్చిన ఇద్దరు మహిళలను గత శనివారం రాత్రి 10 గంటలకు అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారిని లోతుగా విచారించడంతో అక్రమంగా బంగారం తెస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఇద్దరు మహిళల వద్ద నుంచి 1.4 కేజీల 24క్యారెట్ల గోల్డ్ నెక్లెస్‌లు, చెవి రింగులు, చైన్స్, బంగారు గాజులును స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి సేకరించిన బంగారు ఆభరణాల విలువ 80 లక్షల పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆ మహిళలపై కేసు నమోదు చేసి.. లోతుగా విచారిస్తున్నారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు విజయవాడ కస్టమ్స్ అధికారులు. శనివారం గన్నవరం విమానాశ్రయంలో 80 లక్షల విలువైన విదేశీ బంగారపు ఆభరణాలను కస్టమ్ అధికారులు పట్టకోగా, సోమవారం మరలా అదే విమానాశ్రయంలో 40 లక్షల విలువైన విదేశీ బంగారపు ముద్దలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని థానే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బంగారం స్మగ్లింగ్‌కు విజయవాడ ఎయిర్‌పోర్టును అడ్డాగా ఎంచుకున్నారు. వారు తమ వద్ద ఉన్న 800 గ్రాముల 24 క్యారెట్ల విదేశీ బంగారాన్ని ముక్కలుగా పొడి చేసి, ఆ రజనుకు పాలిథిన్ పేపర్‌లో చుట్టి, మైనపు ముద్దలలో ఇమిడ్చి ఆ ముద్దలను ముగ్గురూ తమ మలద్వారాలలో దాచుకొని షార్జా నుంచి ఫ్లైట్ నెంబర్ IX 976లో సోమవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముగ్గురు ప్యాసింజర్లలో ఒకరి నడక కొంచెం తేడాగా ఉండటాన్ని అసిస్టెంట్ కమీషనర్ గమనించారు. దీంతో వారిని వెంటనే ఆపి.. క్షుణ్ణంగా పరిశీలించగా.. బంగారం ఉన్నట్టు గుర్తించారు. ముగ్గురు ప్యాసింజర్ల నుంచి 40 లక్షల రూపాయల విలువైన 800 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఏ.పీ కస్టమ్స్ ప్రివెంటివ్ కమీషనర్ సాధు నరసింహరెడ్డి తెలిపారు.