Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

|

May 17, 2022 | 8:33 PM

తిప్పాయ‌పాలెం వ‌ద్ద వేగంగా వెళ్తుండగా.. టైర్ పంక్చర్ కావడంతో కారు ఎదురుగా వ‌స్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ఆయిల్ ట్యాంకర్ నుంచి మంట‌లు చెల‌రేగి.. కారు పూర్తిగా ద‌గ్ధం అయింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
Ap Road Accident
Follow us on

Prakasam District Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైరు పంక్చర్ అయి.. లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గర జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. తిప్పాయ‌పాలెం వ‌ద్ద వేగంగా వెళ్తుండగా.. టైర్ పంక్చర్ కావడంతో కారు ఎదురుగా వ‌స్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ఆయిల్ ట్యాంకర్ నుంచి మంట‌లు చెల‌రేగి.. కారు పూర్తిగా ద‌గ్ధం అయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స‌జీవ ద‌హ‌నం అయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా.. కారు నెంబర్‌ ఎపి39 డిఇ 6450 ఆధారంగా కారు చిత్తూరు జిల్లా బాక్రాపేటకు చెందిన నరేంద్ర పేరుతో ఉన్నట్టు గుర్తించారు. కారు మార్కాపురం హైవే నుంచి కంభం వైపుగా వెళ్తోన్నట్లు తెలిపారు. కర్నాటకకు చెందిన లారీ విజయవాడ వైపు వెళ్తోండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతుల్లో ఒకరు చిత్తూరుజిల్లా బాక్రాపేటకు చెందిన రావూరి తేజగా గుర్తించారు. కారు యజమాని ఈతి మర్పు నరేంద్ర తన స్నేహితుడు రావూరి తేజకు కారు ఇచ్చాడు. పనిమీద కారు తీసుకెళ్ళిన రావూరి తేజ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రకాశంజిల్లా కంభం నుంచి మార్కాపురం వస్తుండగా కారు టైర్ పేలిపోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.

అయితే.. ఈ సంఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న రావూరి తేజ పాటు మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు. అయితే కారులో రావూరి తేజ ఉన్నారా… లేక మరెవరికైనా కారును ఇచ్చారా అన్న విషయం తెల్సుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో ముగ్గురి మృతదేహాలు ఎవరివన్న విషయం ఫోరెన్సిక్, డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.