Anilkumar Yadav Athmiya Sabha: ఏం జరుగుతుందోనని క్షణక్షణం ఉత్కంఠ. అటు తాజా మంత్రి కాకాని గోవర్థన్(Kakani Govardhan) నగరానికి వస్తున్నారు. ఇటు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్(Anil kumar Yadav) యాదవ్ ఆత్మీయ సభ పెట్టారు. ఇద్దరి మధ్య విభేదాలు బయటపడిన నేపథ్యంలో.. పోటాపోటీ సభలు టెన్షన్ రాజేశాయి. కొద్దిసేపటి క్రితమే అనిల్ సభ ముగిసింది. అయితే.. ఎక్కడా మంత్రి కాకాని పేరు వినిపించలేదు.. ఫోటో కనిపించలేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ.. ప్రసంగించారు మాజీ మంత్రి అనిల్ కుమార్.
వైసీపీ నేతలు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ప్రశాంతంగా ముగిసింది. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన మాజీ మంత్రి అనిల్ ఆత్మీయ సభకు భారీ స్ధాయిలో వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నెల్లూరు సభలో అనిల్ ప్రసంగంలో వాడీవేడీ చూపించారు. టీడీపీకి, జనసేనకు సవాళ్లు విసిరారు ఎమ్మెల్యే అనిల్. తనకు మంత్రి కన్నా.. జగన్ సైనికుడిలా ఉండటమే ఇష్టమన్నారు. నాకు ఎవ్వరూ పోటీ లేరు.. నాకు నేనే పోటీ. ఈ సభ ఎవరికీ పోటీ కాదు, బలనిరూపణ అంతకంటే కాదు. ఆత్మీయ సభ పెడతానంటూ ముందుగానే చెప్పా.. అందుకే పెట్టానంటూ అనిల్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ కాదంటూ మరోసారి విమర్శలు చేశారు అనిల్. దమ్ముంటే వచ్చే ఎలక్షన్లలో 140 సీట్లలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
జగన్ బొమ్మతోనే ఎవరైనా ఎమ్మెల్యే గా గెలవాల్సిందేనని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చంద్రబాబు పొత్తు లేకుండా జగన్ ఓడిస్తామని చెప్పే ధైర్యం ఎవరికీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కాదు భిక్షం నాయక్..వచ్చే ఎన్నికల దమ్ముంటే 140 సీట్లు పోటీచేసే దమ్ము పవన్ కళ్యాణ్ కు ఉందా? వచ్చే ఎన్నికలలో మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే గా గెలుస్తాను. రేపటి నుండి గడపగడప తిరుగుతా అన్నారు అనిల్ కుమార్ యాదవ్. నా రక్తం లో జగన్ నామస్మరణ తప్ప ఏమీ వుండదు. గతంలో మంత్రి పదవి ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాము. ఇప్పుడు మా ఎటాకింగ్ డబుల్, త్రిబుల్ గా ఉంటుందన్నారు. మొదట దఫాలోనే మంత్రి అవుతానని అనుకోలేదన్నారు అనిల్.. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి మరింత దూకుడుగా పనిచేస్తానన్నారు.
జగన్ ,నెల్లూరు ప్రజల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మంత్రిగా ఉండటం కంటే జగన్ అన్న సైనికుడిగా ఉండటమే ఇష్టం. మంత్రి అయ్యాక కొద్దిమంది నేతలను,కేడర్ కలవలేకపోయాను. వారందరికీ ఈ రెండేళ్ళపాటు న్యాయం చేస్తాను. యుద్దానికి తాను నమ్మకున్న సైన్యాన్నే పంపుతాడు.. అలానే జగన్ అన్న మమ్మల్ని ముందుగా మంత్రులనే చేశాడన్నారు. జగనన్న మళ్లీ మళ్లీ సీఎం అవుతారు.. నేను మళ్లీ మళ్లీ అన్న ఆశ్సీస్సులతో మంత్రిని అవుతానని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.