Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు..! అమరావతికి భారీగా నిధులు..! ఇక వాటికి కూడా..?

కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అనేక ఆశలు పెట్టుకుంది. ఏపీలో అభివృద్ధి పరుగులు తీయాలంటే కేంద్ర సహకారం అత్యంత కీలకం. రాష్ట్ర విభజన తర్వాత ఇంకా ఆర్థికంగా పూర్తిగా కోలుకోని ఆంధ్రప్రదేశ్‌కు రానున్న కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకం. దీంతో బడ్జెట్ లో ఏపీ ఏమి కోరకుంటుందంటే..

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు..! అమరావతికి భారీగా నిధులు..! ఇక వాటికి కూడా..?
Amaravathi

Edited By:

Updated on: Jan 31, 2026 | 6:10 PM

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, ప్రాంతీయ అసమానతల తొలగింపు నుంచి పరిశ్రమల అభివృద్ధి వరకు—ప్రతి రంగంలోనూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. అభివృద్ధి వేగం పెంచాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. ఈ నేపథ్యంలో 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన డిమాండ్లతో కేంద్రాన్ని ఆశ్రయించింది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో 2026–27 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 9న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతం చేయాలంటే కేంద్రం నుంచి గణనీయమైన నిధుల మద్దతు అవసరమని స్పష్టంగా విజ్ఞప్తి చేసింది.

రాజధాని అమరావతికి నిధులు….

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్ అమరావతి రాజధాని నిర్మాణమే. ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన రూ.15 వేల కోట్లకు అదనంగా రెండో విడత గ్రాంట్లు కేటాయించి రాజధాని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరింది. పరిపాలనా కేంద్రంగా అమరావతి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆర్థిక శాఖ వివరించింది.

పోలవరం – నల్లమల సాగర్ లింక్

సాగునీటి రంగంలో కీలకమైన పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు కేంద్ర సహాయం అందించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కేంద్రం రూ.40 వేల కోట్ల వరకు నిధులు కేటాయించిన నేపథ్యంలో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కూడా మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి అవసరాలు తీరతాయని వివరించింది.

కేంద్ర పన్నుల వాటా పెంచాలని….

ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి రానున్న నేపథ్యంలో, రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాను పెంచాలని కేంద్రాన్ని కోరింది. ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది.

సాస్కి సాక్షిగా….

రాష్ట్రాల్లో మూలధన పెట్టుబడులకు సహాయంగా అమలులో ఉన్న SASKI పథకాన్ని కొనసాగిస్తూ, 2026–27లో కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని కేంద్రానికి వివరించింది.

రాయలసీమలో పూర్వోదయా….

పూర్వోదయ పథకాన్ని విద్య, వైద్యం, వ్యవసాయం, జీవనోపాధి రంగాలపై కేంద్రీకరించాలని సూచించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా విధాన మార్పులు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 46(2), 46(3) ప్రకారం రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. మూడు సంవత్సరాల్లో రూ.41 వేల కోట్ల వ్యయంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికను కేంద్రం ముందు ఉంచింది. ఈ ప్రణాళికతో రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వివరించింది.

విశాఖ ఎకనామిక్ జోన్ కోసం…

విశాఖ ఆర్థిక ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2026–27లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్రం కోరింది. ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడుల సమన్వయంతో 2032 నాటికి ఈ ప్రాంత జీడీపీని $125 బిలియన్లకు పెంచే లక్ష్యంతో ఈ ప్రతిపాదన రూపొందించామని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తంగా చూస్తే… రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడుతుందనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తాము పంపిన ప్రతిపాదనలని నెరవేర్చుకునే దిశగా రాష్ట్ర లాబీయింగ్ కూడా చేసింది