Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం.. సంస్కృతిలో దాగున్న నిస్వార్థ ప్రేమ..

రైతులు వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా సంస్కృతి - ఆచారంగా భావిస్తారు. ప్రకృతిని, పక్షులను, జంతువులను ప్రేమించటం వారి అనాదిగా వస్తున్న విద్య. తొలి వరి పంటలో కొంత భాగాన్ని పక్షులకు ఆహారంగా అందించే ధాన్యం పనల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది ఇంటికి శుభాన్ని, భూమాతకు గౌరవాన్ని సూచిస్తుంది, మన సంప్రదాయాలను పట్టణ వాసులకు తెలియజేస్తుంది.

Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం.. సంస్కృతిలో దాగున్న నిస్వార్థ ప్రేమ..
The Tradition Of Rice Sheaves

Edited By: Krishna S

Updated on: Dec 12, 2025 | 10:12 AM

భారతదేశానికి రైతులు వెన్నుముక లాంటివారు. వీరికి వ్యవసాయం కేవలం ధనార్జన, కుటుంబ పోషణమాత్రమే కాదు. సంస్కృతి – ఆచారంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రతి రైతు ప్రకృతిని దైవంగా భావిస్తారు. తాను పండించిన తొలి పంటలో కొంత భాగం దేవుడికి గ్రామదేవతకు మొక్కుగా చెల్లించటంతో పాటు తనతో పాటు కలిసి జీవిస్తున్న పక్షులకు కొంత ఆహారంగా తన పంటను అందచేస్తాడు. జంతువులను, పక్షులను ప్రేమించటం, వాటిని సాకటం ప్రతి రైతుకు అనాదిగా వస్తున్న విద్య. వ్యవసాయం చేసే రైతులు ధాన్యం ఇంటికి రాగానే ధాన్యం పనలతో జడలు అల్లుతారు. వాటిని క్రమపద్ధతిలో కుచ్చులా చేసి దాని గుమ్మం ముందు కడతారు అదేవిధంగా దేవాలయాల్లోనూ ఉంచుతారు. ఈ ధాన్యం కుచ్చులో వుండే గింజలను పక్షులు ఆహారంగా తీసుకుంటాయి.

ధాన్యం రాశులు ఉన్న ఇంటిని దరిద్రం తాకాదని పెద్దలు చెబుతారు. ఇక నేటి యాంత్రిక యుగంలోనూ రైతులు ఈ పద్దతిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పిచుకలు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. అవి చుట్టూ తిరుగుతూ కిచ కిచ మంటూ సవ్వడి చేస్తుంటే ఏంతో సందడిగా ఉంటుంది. అలాంటి పక్షులకు నేడు కూడు, గూడు కరువైంది. పట్టణీకరణ నేపథ్యంలో పక్షుల ఆవాసాలకు ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి తరుణలో పక్షుల ప్రేమికులు వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు కూడా తమ వంతుగా పక్షులు బ్రతకడానికి ఇప్పటికి కృషి చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల రైతులు తమ మొదటి వరి పంట కంకులు పక్షులకు ఆహారంగా పెద్ద మండువా లోగిళ్లు, దేవాయాల వద్ద, సత్రాల వద్ద వేలాడదీయడం ఆనవాయితీ వుండేది.

ఆహారం అందించడానికి వరి కంకుల కుచ్చులు తయారీలో రైతులు తమ కళాత్మకతను ప్రదర్శిస్తున్నారు. ఇవి ఏంటో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తణుకు రూరల్ మండలం వేల్పూరు గ్రామంలో రైతులు వినాయకుని గుడి వద్ద సార్వా పంటకు సంబంధించిన వరి పనలను సేకరించి వాటిని శుభ్రం చేసి జడలుగా అల్లుతున్నారు. జడలను కుచ్చులుగా తయారు చేసి వాటిని దేవాలయాల వద్ద పిచ్చుకలు వచ్చి తినేలా వేలాడదీస్తున్నారు. ఇంటి ముందు ఆలయాల్లో కనిపించే ఈ వారికుచ్చులు రైతు చెమటకు చిహ్నం మాత్రమే కాదు మన సంస్కృతిలో ఒక భాగం. ఇంటికి శుభం చేకూర్చే కార్యక్రమం, మరోవైపు భూమాతకు కర్షకుడు ఇచ్చే గౌరవమని రైతులు చెబుతున్నారు. వీటిని చూస్తుంటే వ్యవసాయం అంటే ఏంటో తెలియని కాన్వెంట్ ప్రోడక్ట్స్ , పట్టణ వాసులకు మన మూలాలు సాంప్రదాయాలు అవగతమవుతాయని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.