
ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముస్తాబు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లల్లో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. శనివారం అనకాపల్లిలోని తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో నేటి నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులందరికీ పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం పెంచే పనులను వివరించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని తొలుత పార్వతీపురం మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టారు. అక్కడి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి విద్యార్థుల్లో ఈ కార్యక్రమం వల్ల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విద్యార్థులను మంచి అలవాట్లతో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని స్కూళ్లల్లో క్లాసుల్లో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి సరిగ్గా తయారై రాకపోతే.. వారిని ముస్తాబు కార్నర్ దగ్గర గుర్తిస్తారు. ఫేస్ వాష్ చేసుకుని, తల దువ్వుకుని వస్తేనే క్లాస్‌లోకి అనుమతి ఇస్తారు.
ముస్తాబు కార్నర్ వద్ద అవసరమైన అన్నీ పరికరాలను సిద్దం చేస్తారు. హ్యాండ్ వాష్, టవల్, దువ్వెన, కట్టర్, సబ్బు, నెయిల్, అద్దం వంటివి ఉంటాయి. ఇక పిల్లలు టాయిలెట్ నుంచి వెళ్లి వచ్చాక, అన్నం తినేటప్పుడు చేతులు వాష్ చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే పిల్లలకు ముస్తాబు స్టార్ పేరుతో ప్రతీవారం ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇక మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో కూడా అవార్డులు అందించనున్నారు.