చిత్తూరు జిల్లా అడవుల్లో చిరుత పులుల మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం రెండు చోట్ల చిరుతలు మృతి కలకలం రేపుతోంది. యాదమరి, సోమల అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల కళేబరాలను గుర్తించిన అటవీశాఖ హడలిపోతోంది. మృతి చెందిన చిరుతపులుల కాళ్లను నరికి, కోరలను మాయం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వేటగాళ్ల ఉచ్చుకు చిరుతలు బలవుతున్నాయా…? లేదంటే ప్రమాదాలకు గురై మరణిస్తున్నాయా..? అన్న దానిపై స్పష్టత లేకపోగా చిరుతల మరణాల వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది.. !
ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో పోచింగ్ ప్రాబ్లం చిరుతపులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శేషాచలం, కౌండిన్య అభయారణ్యంలో మృత్యువాత పడుతున్న చిరుతలు ఉనికిని కోల్పోతున్నాయి. వరుసగా బయటపడుతున్న చిరుతల మరణాల వ్యవహారం అటవీ శాఖను షాక్‌కు గురి చేసింది. రెండు రోజుల క్రితం కౌడన్య అభయారణ్యం పరిసరాల్లోని యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందినట్లు గుర్తించింది అటవీశాఖ సిబ్బంది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే చిరుత పులి మృతి చెందినట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది చిరుత నోటిలోని కోరలు, కాళ్లు నరికి పంజాలోని గోర్లు పీకేసినట్లు గుర్తించారు. పక్కాగా వేటగాళ్ళ ఉచ్చుకు బలైనట్లు అనుమానించారు. ఘటన స్థలాలికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, పోలీసులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీ కంపోజైన చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించిన తిరుపతి జూ వైద్యులు స్థానిక వెటర్నరీ డాక్టర్లు వేటగాళ్ల పనేనన్న నిర్ధారణకు వచ్చారు.
చిరుత మృతికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు చిరుత మృతికి వేటగాళ్ల ఉచ్చు కారణమా లేక రైతులు పంటపొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతోనేమైనా మృతి చెందందా అన్న కోణం లోనూ విచారణ చేస్తున్నా వేటగాళ్ల చేతిలోనే చిరుత మృతి చెంది ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. మరోవైపు సోమల మండలం గట్టువారిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మృతి గుర్తించిన అటవీశాఖ అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయినట్లు భావిస్తున్నారు. మృతి చెందిన చిరుత కళేబరం కాళ్లు, నోట్లోని పళ్ళు మాయం అయినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు అక్కడ కూడా వేటగాళ్ల పనేనన్న అనుమానిస్తున్నారు.
ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుతలు వేటగాళ్లకు బలవుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ తీగలు, ఉచ్చులు, నాటు తుపాకులతో వన్యప్రాణులను స్మగ్లర్లు వేటాడుతున్నట్లు అనుమానిస్తున్నారు చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారి భరణి. ఇలా చిరుతలను చంపుతున్న వేటగాళ్ల ను పట్టుకునే పనిలో ఉన్న అటవీశాఖ సిబ్బంది చిరుత మరణాలపై కీలక విషయాలు సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. కౌడిన్య అభయారణ్యం ప్రాంతంలో వన్యప్రాణుల ఎక్కువగా వేటాడుతున్నట్లు గుర్తించింది. బంగారుపాలెం, యాదమరి, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణుల వేట పై ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టింది.
వీడియో చూడండి..
వన్యప్రాణుల మాంసాన్ని తమిళనాడులో విక్రయిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు కౌండిన్య అటవీప్రాంతంలో దాదాపు 5 కు పైగా చిరుతపులులను వేటాడి పూడ్చి పెట్టినట్లు చెబుతున్నారు. చిరుత గోళ్ళు, కోరలు కోసమే వేట కొనసాగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుతల కాళ్లు క్షుద్ర పూజలలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు చిరుతల మృతిపై దర్యాప్తు వేగవంతం చేసారు. ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ముఠా ఆగడాలను కనిపెట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారుల అదుపులో కీలక నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మృత్యువాత చిరుతల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. యాదమరి మండలంలో జరిగిన చిరుత మృతి పై దర్యాప్తు చేపట్టేందుకు సెంట్రల్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ టీం చిత్తూరుకు చేరుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం చిత్తూరు వెస్ట్ రేంజ్ ఆఫీసులో వివరాలు సేకరించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..