
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొనసాగుతున్న రామాలయ వివాదం, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చలో ఆకివీడు కార్యక్రమాలు టెన్షన్ పెంచాయి. అటు హిందూ సంఘాలు, ఇటు క్రిస్టియన్ సంఘాలు పోటాపోటీగా ఛలో అకివీడు అంటూ పిలుపు ఇవ్వడం ఉత్కంఠను పెంచేసింది. దీంతో 500 మంది పోలీసులను ఆకివీడులో మోహరించారు.
చలో ఆకివీడుకు ఎవరికీ ఎలాంటి పర్మిషన్ లేదన్న పోలీసులు
రెండు సంఘాల పిలుపుతో ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండటంతో.. చలో ఆకివీడుకు ఎవరికీ ఎలాంటి పర్మిషన్ లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో స్థానికంగా 144, 30 సెక్షన్లు అమల్లో ఉన్నాయని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదని హెచ్చరించారు. కాదని ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తవ్యక్తులెవరూ గ్రామంలోకి రాకుండా.. ఉప్పుటేరు, ఉండి దగ్గర తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
కరాటే కళ్యాణిని కైకలూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇక చలో ఆకివీడుకు పిలుపునిచ్చిన కరాటే కళ్యాణిని కూడా పోలీసులు కైకలూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా.. పోలీసుల తీరుపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు కొంతమంది హిందూ సంఘాలకు చెందిన వాళ్లు ఆకివీడుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో 67 మందిపై కేసులు
మరోవైపు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి కేసులో మొత్తం 67 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే 41 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటన తరువాత ఆకివీడులో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు నిఘా పెంచారు.
Also Read రైతులకు సంకటంగా మారిన అడవి ఆవుల కథేంటి..?