Gorantla Butchaiah Chowdary: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి గుడ్ బై చెప్తారంటూ వచ్చిన వార్తలు ఆ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించింది. రాజీనామా అంశంపై బుచ్చయ్య చౌదరి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. అనుచరుల వద్ద మాత్రం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం తీరుపై ఆయన కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయాలన్న నిర్ణయంపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. సుమారు అరగంటకు పైగా ఆయనతో మాట్లాడారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని, తొందరపడొద్దని బుచ్చయ్య చౌదరిని సముదాయించే ప్రయత్నం చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా బుచ్చయ్య చౌదరితో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.
కాగా, టీడీపీకి రాజీనామా అంశంపై బుచ్చయ్య చౌదరిని మీడియా సంప్రదించగా.. గోరంట్ల స్పందించలేదు. తాను ఇప్పుడేమీ మాట్లాడనని, తర్వాత స్పందిస్తానంటూ వెళ్లిపోయారు. కాగా, బుచ్చయ్య రాజీనామాపై వార్తలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు.. టీడీపీకి గోరంట్ల రాజీనామా చేయడం లేదన్నారు. పార్టీలో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే భావనలో గోరంట్ల ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత గోరంట్లతో మాట్లాడేందుకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గోరంట్లతో మాట్లాడామని, పార్టీకి ఆయన రాజీనామా చేయబోరని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు పరిష్కారం చేసుకుంటామని చెప్పారు. గోరంట్ల పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సుశిక్షితుడైన నేత అని కొనియాడారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు.. గొరంట్లతో చర్చించారని రామకృష్ణా రెడ్డి తెలిపారు.
Also read:
TDP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత.. కారణమదేనా..?