
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సోమవారం (జనవరి 12) సాయంత్రం కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళం అరసవల్లిలోని వెలమ వీధిలో తన నివాసంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కాగా అదే రోజు చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. ఈ నేపధ్యంలో వైద్యులు ICU లో వెంటి లెటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించి సాయంత్రం తుది శ్వాస విడిచారు. హాస్పిటల్ నుంచి అరసవల్లి వెలమ కాలనీలోని అతని నివాసానికి అప్పలసూర్యనాయణ పార్థివ దేహాన్ని తరలించారు. మంగళవారం అరసవల్లిలో అతని అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ఓ సాధారణ కౌన్సిలర్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నేత గుండ అప్పల సూర్యనారాయణ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా మచ్చ లేని నాయకుడుగా రాజకీయాలలో ఎదిగారు. ముక్కుసూటి మనిషిగా ఆయనకు పేరుంది. శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి, తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఆ తర్వాత MLA గా, మంత్రిగా అంచలంచెలుగా ఎదిగారు.1985 నుంచి వరుసగా నాలుగు సార్లు శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ MLA గా గెలుపొందారు. 1989లో NTR కేబినెట్లో కొంత కాలం మంత్రిగాను పని చేసారు.
గుండ అప్పల సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2014లో ఎన్నికల్లో శ్రీకాకుళం MLA గా గెలుపొందారు అతని భార్య గుండ లక్ష్మీదేవి.1985 నుంచి 2019 వరకు టీడీపీ లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అంటే గుండ దంపతులదే. ఈసారి జరిగిన 2024 ఎన్నికల్లో గుండ దంపతులను కాదని, కొత్త వ్యక్తి అయిన గొండు శంకర్‌కు టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. భర్త మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు భార్య, మాజీ MLA గుండ లక్ష్మీ దేవి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..