Criminal case on Nara Lokesh: ఏపీలో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ 20 వేల పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికే పగటి పూట కర్ఫ్యూ కూడా పెట్టింది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపై రాష్ట్ర సర్కార్ కేసులు నమోదు చేస్తోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టిన పోలీసులు.. తాజాగా ఆయన తనయుడు నారా లోకేశ్‌పై మరో కేసు నమోదు అయ్యింది.
ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారంటూ అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్‌లో క్రమినల్ కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై ఎలాంటి ఎలాంటి సంబంధం లేనప్పటికీ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ ద్వారా అసత్య ప్రచారం చేశారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసి గౌరవానికి భంగం కలిగించారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత, విద్వేషం కలిగించేలా కుట్రచేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఫిర్యాదు మేరకు నారా లోకేష్ పై క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐపీసీ 153(A),505, 506 గా కేసు నమోదు చేసినట్లు డి.హిరేహాళ్ పోలీసులు తెలిపారు.
గత నెల 21వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన టీడీపీ కార్యకర్త మారుతీపై కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా రాంపురం గ్రామం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో మారుతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నారా లోకేష్.. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నందునే మారుతిపై కక్ష గట్టారని ఆరోపించారు. మారుతికి చెందిన బేకరీని మూసివేయించాలని చూశారని, అంతేకాకుండా అతడిపై దాడి చేయించారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం టిడిపి కార్యకర్త మారుతి, సోషల్‌మీడియా వేదికగా ఎమ్మెల్యే అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నారని గూండాలతో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6
— Lokesh Nara (@naralokesh) April 21, 2021
ఇదిలావుంటే, శుక్రవారం కరోనా వైరస్ వేరియంటే పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ సుబ్బయ్య అనే న్యాయవాది కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1) (బి) (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
Read Also…. Kodali Nani: కొత్త వైరస్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. ఏపీలో సీబీఎన్ 420 వైరస్ ఉందన్న కొడాలి నానీ