ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం ఎంపీల ఫిర్యాదు

|

Feb 04, 2021 | 4:18 AM

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకపర్వం కొనసాగుతోందని తెలుగుదేశం పార్ట ఎంపీలు ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన..

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం ఎంపీల ఫిర్యాదు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకపర్వం కొనసాగుతోందని తెలుగుదేశం పార్ట ఎంపీలు ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తెలుగుదేశం ఎంపీల బృందం, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నేతృత్వంలో హోంమంత్రిని కలిసిన ఈ బృందంలో ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. అమిత్ షాకు అందజేసిన లేఖలో తొలుత దేవాలయాలపై దాడులు, బలవంతపు మతమార్పిళ్ల గురించి ప్రస్తావించారు. పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం, 29,841 మంది క్రిస్టియన్ పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందజేయడం, టీటీడీలో పింక్ డైమండ్ మాయమవడం, అంతర్వేదిలో రథం దగ్దం, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహం మాయమవడం, రామతీర్థంలో రాముడి విగ్రహం తలను విరగ్గొట్టడం వంటి ఘటనలను పొందుపరిచారు.

రెండో అంశంగా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై దాడిని ప్రస్తావించారు. ఈ క్రమంలో శాసనమండలి రద్దు, న్యాయవ్యవస్థతో ఘర్షణ, ఆ వ్యవస్థపై మాటలదాడి గురించి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై కూడా ఇదే తరహాలో దాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి విమర్శిస్తున్న మీడియా సంస్థలపైనా దాడులు, వేధింపులు జరుగుతున్నాయని టీడీపీ నేతల లేఖలో పేర్కొన్నారు. మూడో అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రస్తావిస్తూ అవి పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. బీసీలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, మహిళలు అన్న తేడా లేకుండా అన్నివర్గాలపై వైకాపా నేతలు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపు ధోరణితో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కోడేల శివప్రసాద్, నన్నపనేని రాజకుమారి, కొల్లు రవీంద్ర, కళా వెంకట్రావుపై కేసులు, మాట్లాడే స్వేచ్ఛకు భంగం కలిగేలా అరెస్టులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

నాలుగో అంశంగా మూడు రాజధానుల గురించి ప్రస్తావిస్తూ అమరావతిని దెబ్బతీయడం కోసమే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుగుదేశం ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. ఐదో అంశంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయి అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోందని విమర్శించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇతర ఖనిజాల అక్రమ మైనింగ్, భూసేకరణలో అక్రమాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. చివరి అంశంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, కోవిడ్-19 నియంత్రణలో విఫలమవడంతో పాటు పెట్టుబడులకు ముందుకురాలేని స్థితిలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాజ్యాంగబద్ధంగా పాలన సాగేలా చూడాలని అమిత్ షాను కోరారు.

అనంతరం పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తమకు కేటాయించిన కొద్ది సమయంలో పాస్టర్ ప్రవీణ్ హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వీడియోను అమిత్ షాకు చూపించామని టీడీపీపీ నేత గల్లా జయదేవ్ తెలిపారు. జడ్జిలపై దాడి, ఎస్ఈసీపై దాడులను వివరిస్తూ, ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని చెప్పామన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు, పట్టాభిపై దాడి ఘటనను కూడా వివరించామని తెలిపారు. అధికార వైసీపీ దురాగతాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని మరో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా ప్రతిపక్ష నేతలు, మీడియాపై కేసులు పెడుతున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రిని కోరామని తెలిపారు. అన్నింటికీ సంబంధించిన ఆధారాలు హోంమంత్రికి సమర్పించామని కనకమేడల తెలిపారు. ఇంకా ఏమైనా ఆధారాలు, వీడియోలు ఉంటే కూడా హోంశాఖ కార్యాలయానికి ఇవ్వాలని అమిత్ షా తమతో చెప్పినట్టు ఆయన వివరించారు.

రాజ్యాంగ విధి, ధర్మాన్ని అనుసరిస్తున్నాను : ఎస్వీ యూనివర్సిటీలో మీడియాతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్