ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న సీఎం జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంగా మారింది. అసెంబ్లీ సమావేశంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై.. విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై టీడీపీ జనసేనలు తప్పుపడుతుండగా.. బీజేపీ మాత్రం స్వాగతిస్తోంది. ఇదిలా ఉంటే.. జగన్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలన్న టీడీపీ స్టాండ్‌కు భిన్నంగా జగన్ ప్రకటనను స్వాగతించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. జగన్ చేసిన ప్రకటనపై గంటా శ్రీనివాస రావు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. విశాఖపట్టణాన్ని పరిపాలనా నగరంగా మార్చే అవకాశముందన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ఆయన జైకొట్టారు.
సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో విశాఖ పరిపాలనా రాజధాని గా అందరి ఆశలను నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని.. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారంటూ గంటా శ్రీనివాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం. #VizagAPExecutivecapital
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) December 17, 2019
రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) December 17, 2019
కాగా, గంటా శ్రీనివాసరావు టాపిక్ ఇప్పుడు టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపికి గుడ్‌బై చెప్పి.. వైసీపీ గూటికి చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. గతకొద్ది రోజులుగా పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారని..
త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారన్న వార్తాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని అంశంలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ఆయన సమర్థించడం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.