ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత లేఖ రాశారు. మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని ఆమె ఆరోపించారు. మహిళలపై వైసీపీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 1500 మందికి పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని విమర్శించారు. రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉండి కూడా.. మహిళలకు రక్షణ కరువవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన సీఐటీయూ నాయకురాలు గరికపాటి నాగలక్ష్మి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. డ్వాక్రా గ్రూపుల రుణాల విషయంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత వేధింపులు కారణంగానే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నాగలక్ష్మి భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని తనయుడు, వైసీపీ నేత పేర్ని కిట్టు సందర్శించారు.
Also Read
India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?