TDP Leader Somireddy vs MLA Kakani: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ డైలమాలో పడింది. సోమవారం నుంచి పంపిణీ చేయలేమని చెప్పేస్తున్నారు ఆనందయ్య శిష్య బృందం. ఎవరూ కృష్ణపట్నం రావద్దని కరాఖండిగా చెబుతున్నారు. కరోనా మందు తయారీ బాధ్యత ఆనందయ్య ఒక్కరిదే కాదంటున్నారు. ఆర్థికవనరులు, ముడిపదార్థాలు సమకూర్చకుండా.. లక్షల మందికి మందు తయారీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. తామేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడితో ఆనందయ్య కంటతడిపెడుతున్నారని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు.
ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనుకున్న ఆనందయ్య మందుతో అధికారపార్టీ నేతలు బిజినెస్ చేసుకోవాలని చూశారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ వెబ్‌సైట్ సృష్టించింది వైసీపీ నేతలేనన్నారు. సోమిరెడ్డి ఆరోపణలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి. వ్యక్తిగత దూషణలకు దిగారు. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారన్న కాకాని.. తేల్చుకుందాం దమ్ముంటే రమ్మంటూ సవాల్ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి విచారణకు కూడా తాను సిద్ధమన్నారు కాకాని. తన తప్పుందని నిరూపిస్తే ఉరేసుకునేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆనందయ్య మందుపై మొదటి నుంచీ సర్వేపల్లి నేతల మధ్య సాగుతున్న మాటలయుద్ధం.. తాజా వివాదంతో మరింత ముదిరింది.
‘‘ఆయుర్వేదంలో ఆనందయ్యకు ఎంతో అనుభవం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారు. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీని జిల్లా కలెక్టర్ నిలిపివేశారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే.. నేరుగా ఆనందయ్యకే చేయవచ్చు. ప్రభుత్వానికి, వైసీపీకి ఆనందయ్య మందుతో సంబంధం లేదు. అన్ని జిల్లాలకు మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనందయ్య మందుకు అనుమతుల కోసం ఎంతో కష్టపడ్డాం’’ అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ తెలిపారు.
ఇదిలావుంటే, ఆనందయ్య మందు పేరుతో సొమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి కుటిల ప్రయత్నం చేశారని ఆరోపించారు. నకిలీ సైట్ క్రియేట్ చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుకు ఫ్యాను గుర్తు పెట్టడం ముఖ్యమంత్రిని దిగజార్చడమే అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్‌లకు లేదన్నారు. సుమోటోగా కుట్రపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. తాము మోమోరాండం ఇవ్వడానికి సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Read Also…. CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీ టూర్.. హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం!