Devineni Uma released: కృష్ణాజిల్లా మైలవరం మైనింగ్ దాడుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ.. రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఇవాళ విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన దేవినేనికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరీశీలకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి.కొండూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఐతే తనపై అక్రమంగా కేసులు బనాయించారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఆయన బయటకు వచ్చారు.
గత నెల 28వ తేదీన కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దేవినేని ఉమతో పాటు పలువురు టీడీపీ నేతలు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు దేవినేని ఉమ వర్గాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తలు దేవినేని ఉమ కారుపై రాళ్లు రువ్వారు. ఐతే ఈ వ్యవహారంలో దేవినేని ఉమ కావాలనే అక్కడికి వెళ్లి ఘర్షణ రేపారని తప్పుబట్టిన పోలీసులు కేసు బనాయించారు.
Read also: Huzurabad By Election: హుజూరాబాద్‌లో రాజకీయ హోరాహోరీ.. ఈసీ ఎన్నికల నగారాపై ఉత్కంఠ.!