AP Politics: రేప‌టి నుంచి టీడీపీ జ‌య‌హో బీసీ స‌మావేశాలు.. వైసీపీకే తమ మ‌ద్దతు అంటూ బీసీ సంఘాల తీర్మానం

| Edited By: Balaraju Goud

Jan 04, 2024 | 7:34 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తుంది. ప్రధాన పార్టీల‌న్ని ఓట్ల వేట‌లో ప‌డ్డాయి. కీల‌క‌మైన బీసీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం, వైసీపీ ఫోక‌స్ పెట్టాయి. బీసీల పార్టీ త‌మ‌దంటే త‌మ‌దే అంటూ రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన తెలుగు దేశం పార్టీ జ‌య‌హో బీసీ పేరుతో 40 రోజుల పాటు స‌మావేశాల‌కు సిద్దమైంది. ఇక ఏపీలోని బీసీ కుల‌సంఘాల‌న్ని వైసీపీకి మ‌ద్దతు ప్రక‌టిస్తూ తీర్మానం చేశాయి.

AP Politics: రేప‌టి నుంచి టీడీపీ జ‌య‌హో బీసీ స‌మావేశాలు.. వైసీపీకే తమ మ‌ద్దతు అంటూ బీసీ సంఘాల తీర్మానం
Ap Politics
Follow us on

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తుంది. ప్రధాన పార్టీల‌న్ని ఓట్ల వేట‌లో ప‌డ్డాయి. కీల‌క‌మైన బీసీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం, వైసీపీ ఫోక‌స్ పెట్టాయి. బీసీల పార్టీ త‌మ‌దంటే త‌మ‌దే అంటూ రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన తెలుగు దేశం పార్టీ జ‌య‌హో బీసీ పేరుతో 40 రోజుల పాటు స‌మావేశాల‌కు సిద్దమైంది. ఇక ఏపీలోని బీసీ కుల‌సంఘాల‌న్ని వైసీపీకి మ‌ద్దతు ప్రక‌టిస్తూ తీర్మానం చేశాయి. ఒక్క వైసీపీనే బీసీల పార్టీ అని ప్రక‌టించాయి.

ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతున్న కొద్దీ ప్రధాన రాజ‌కీయ పార్టీలు కులాల‌వారీ ఓట్లను ఆకట్టుకునే ప‌నిలో ప‌డ్డాయి. టీడీపీ – వైసీపీ రెండింటిలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే బీసీ ఓటు బ్యాంకు ఎంతో కీల‌కం. ఒక‌ప్పుడు టీడీపీకి అండ‌గా ఉన్న బీసీలంతా గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బాట ప‌ట్టారు. దీంతో టీడీపీకి ఇబ్బందులు త‌ప్పలేదు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీ ఓట్ల కోసం ఎవ‌రి ప్రయ‌త్నాల్లో వారు ప‌డ్డారు. మ‌రోవైపు బీసీ కుల‌సంఘాలు కూడా త‌మ వాద‌న తెర‌ మీద‌కు తెస్తున్నాయి. ఇప్పటికే సామాజిక సాధికార యాత్ర పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో పడింది అధికార వైసీపి. బ‌స్సు యాత్రల ద్వారా బీసీల‌కు చేసిన సంక్షేమాన్ని చెప్పుకొస్తుంది.

మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ కూడా జ‌య‌హో బీసీ పేరుతో ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. మొత్తం 40 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా, మండ‌లాల వారీగా బీసీ స‌మావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీల స‌మ‌స్యలు, వారికి ఎలాంటి అవ‌స‌రాలున్నాయి, ఏ ర‌కంగా బీసీల‌ను అన్ని విధాలుగా పైకి తీసుకురావ‌చ్చు అనే అంశాల‌పై ఈ సమావేశాల్లో చ‌ర్చించి పార్టీ అధిష్టానానికి నివేదిక‌లు ఇస్తారు. అంతేకాదు బీసీల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా త‌యారుచేస్తామ‌ని ప్రక‌టించారు టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు. జ‌య‌హో బీసీ కార్యక్రమంపై టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో వ‌ర్క్ షాప్ నిర్వహించారు. టీడీపీకి మొద‌టి నుంచీ బీసీలు అండ‌గా ఉన్నార‌ని, వ‌చ్చే ఐదేళ్లలో బీసీల‌ను ఆదుకుంటామ‌ని చెప్పుకొచ్చారు. మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చేలా బీసీలు స‌హ‌క‌రించాల‌ని కోరారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బీసీల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని ఆరోపించారు చంద్రబాబు.

వైసీపీకే తమ మ‌ద్దతు అంటూ బీసీ సంఘాల తీర్మానం

విజ‌య‌వాడ‌లో ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ ఆధ్వర్యంలో 90 బీసీ సంఘాల ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రిగింది. వైసీపీ ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బీద మ‌స్తాన్ రావు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో ప‌లు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో బీసీల‌కు న్యాయం చేస్తున్న పార్టీ ఒక్క వైసీపీయేన‌ని తీర్మానం చేశారు. అందుకే రాబోయే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కుల సంఘాలు ప్రక‌టించాయి. సీఎం జగన్ ప్రజల జీవితాలను బాగుచేస్తున్నారని, ఆయ‌న‌ పాలనలో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు.

మరోవైపు, వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి రేప‌టి నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల‌ని అన్ని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. సీఎం జ‌గ‌న్ బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్ క‌ళ్యాణ్ ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు.

టీడీపీ జ‌య‌హో బీసీ, మ‌రోవైపు బీసీ సంఘాలు వైసీపీకి మ‌ద్దతుగా స‌మావేశాల‌తో జనవరి 5 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాజ‌కీయం మొద‌లుకానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…