Sattenapalli Politics: ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకుపైనే ఉంది. కానీ సత్తెనపల్లి తెలుగుదేశంలో వర్గపోరు ఇప్పుడే పీక్‌కు చేరింది. ఒకవైపు కోడెల శివరాంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత. మరోవైపు ఆ సీటు కోసం సీనియర్ నేత అప్పుడే కర్ఛీఫ్ వేసేశారు. కోడెల వర్ధంతి సభ గ్రూప్‌ల పోరును తెరపైకి తెచ్చింది. అది అధిష్టానానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. కట్ చేస్తే, గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో గ్రూపుల పోరు ఇప్పుడు మరింత తీవ్రమైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా విభేదాలు రచ్చ కెక్కాయి. కోడెల కుమారుడు కోడెల శివరాం వ్యవహార శైలిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు రాకుండా శివరాం అడ్డుకొని సొంతానికి వాడుకున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జరిగిన కోడెల విగ్రహావిష్కరణకు కీలక నేతలు రాకుండా చూడాలని సత్తెనపల్లి నేతలు ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. దాంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గైర్హాజరయ్యారు. ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన వారంతా వెళ్లలేదు. ఈ రకంగా చాపకింద నీరులా పెరుగుతున్న పార్టీలో అసంతృప్తిపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. త్వరలోనే ఈ వివాదాలకు చెక్ పెట్టాలని చూస్తోంది.
మరోవైపు సత్తెనపల్లి సీటుపై కర్చీఫ్ వేశారు మాజీ ఎంపీ, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు. ఇటీవల అధినేత చంద్రబాబును కలిశారాయన. రాజకీయాల నుంచి తాను రిటైర్ అయినట్లు చెప్పారు. కానీ జిల్లాలో రెండు సీట్లను తన కూతురు, కొడుక్కి ఇవ్వాలని కోరారు. సత్తెనపల్లి సీటు తమకే ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న రాయపాటి చంద్రబాబును కలిసి తన మనసులో చెప్పడం గుంటూరు టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. రాయపాటి ఎంట్రీతో సత్తెనపల్లి సీటు కోడెల శివరాంకు ఇస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.