
ఎలమంచిలి, డిసెంబర్ 29: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్‌లో జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఏసీ బోగీ B1లో చెలరేగిన మంటలు.. B1 నుంచి మరో ఏసీ బోగి M2కి అంటుకన్నాయి. మంటల్లో B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమవగా B1 బోగిలో ఒకరు సజీవదహనమైనట్లు ఇప్పటికే రైల్వే పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతుడిని విజయవాడ వాసిగా గుర్తించారు అధికారులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ సిబ్బంది మంటలార్పింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
టీటీఈ, లోకో పైలట్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పింది. మంటలను గమనించి లోకో పైలట్ రైలును ఆపేయడంతో ఏసీ బోగీల నుంచి బయటకు వచ్చి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. మంటలు చెలరేగడంతో భయంతో బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో విశాఖ-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదం ఘటనతో ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో పలు రైలు నిలిచిపోయింది. దీంతో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంటల్లో దగ్ధమైన కోచ్‌లను తొలగించి.. కొత్త బోగీల్లో సర్దుబాటుచేసి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రయాణికులను బస్సుల్లో అనకాపల్లి తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఎలమంచిలి రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ల జారీ నిలిపివేశారు. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు చూసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ పాసింజర్ లు మాత్రమే ఎలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేయాలని ప్రకటించారు. ఏలమంచిలి (YLM) వద్ద ఆగే రైళ్లను కాస్త ముందుగా వాల్తేరు డివిజన్‌లోనే నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో ఈ కింది రైళ్ల రాకపోకల్లో స్వల్ప అంతరాయం నెలకొంది. ఈ ఎక్స్‌రైళ్లు 3 నుంచి 4 గంటల వరకు ఆలస్యంగా నడవనున్నాయి.
ఇతర రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయి. అన్ని రైలు సేవలు త్వరలో పునఃప్రారంభమవుతాయని రైల్వే ఆధికారులు వెల్లడించారు. రైళ్ల సమాచారానికి సంబంధించిన వివరాలను ఎలమంచిలి- 7815909386, అనకాపల్లి- 7569305669, తుని- 7815909479, సామర్లకోట- 7382629990, రాజమహేంద్రవరం- 0883-2420541/43, ఏలూరు- 7569305268, విజయవాడ- 0866-2575167.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చని వివరించారు.
విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ ఘటనాస్థలానికెళ్లి రైలును పరిశీలించారు. B1 కోచ్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అంచనా. బోగీలో దుప్పట్లు ఉండటంతో వేగంగా చెలరేగిన మంటలు. B1 కోచ్‌లో ఒక మృతదేహం గుర్తించామని డీఆర్‌ఎం మోహిత్ తెలిపారు. B1 కోచ్ ఎలక్ట్రికల్ ప్యానల్ నుంచి మంటలు చేలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. B1, M2 కోచ్‌ల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అతికష్టంమీద వాటిని అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. మంటల దాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమైంది. కోచ్ అద్దాలను పగలకొట్టి ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు రెస్క్యూ టీమ్స్. అందరూ గాఢనిద్రలో ఉండగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో పోలీ మెటీరియల్, దుప్పట్లు ఉండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అయితే, టీటీఈ, లోకో పైలట్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పింది. అనకాపల్లి తర్వాత.. ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా.. రైల్ బ్రేక్ జామ్ అయ్యింది.. దాంతో, లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు.. వెనక్కి చూసేసరికి ఓ కోచ్ నుంచి మంటలను గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు.. వెంటనే, ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.