Yaas Cyclone: బంగాళాఖాతంలో ‘యాస్’ తుపాను ప్రభావం కొనసాగుతోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశలో కదులుతూ పారాదీప్(ఒడిశా) దక్షిణ ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో.. బాలాసోర్(ఒడిశా)కి దక్షిణ ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో, దిఘా(పశ్చిమ బెంగాల్)కి దక్షిణ ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రాగల 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 26వ తేదీ మధ్యాహ్నం సమయానికి ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలలోని పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉండగా.. యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక గురువారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా.. నైరుతి రుతుపవనాలు మంగళవారం నాడు మాల్దీవులు-కొమరిన్ ప్రాంతములోని కొన్ని ప్రదేశాలు, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతము లోని మరికొన్ని ప్రాంతాలలోనికి ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమరిన్ ప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం లలోని మరికొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది.
Also read: