ఆరుబయటకు వెళ్లిన మహిళ ఎంతకు తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కటుంబ సభ్యులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కుమార్తె స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కుమారుడు దినేష్‌తో 2017 ఆగస్టులో వివాహమైంది. వీరికి సుమారు మూడేళ్ల కుమారుడు సమర్పణ్ ఉన్నాడు. బహిర్భూమికి వెళతానని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో మామ అప్పన్న స్థానికులతో కలిసి తోటలో గాలించగా.. రక్తపు మడుగులో స్వాతి కనిపించింది. వెంటనే 108 వాహనంలో రాత్రి 9.30 గంటల సమయంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. అయితే స్వాతి తల్లి రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. స్వాతి బహిర్భూమి కోసం వెళ్లిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన స్వాతి బంగారు చెవి దిద్దులు, చెప్పులు, జడ క్లిప్ సేకరించారు. అక్కడకు ఖాళీ క్వార్టర్ మద్యం సీసాను కూడా క్లూస్ టీమ్ సీజ్ చేసి స్థానిక ఎస్సై కూన గోవిందరావుకు అందించారు. అయితే హత్య జరిగిన స్థలంలో ఉండాల్సిన స్వాతి సెల్‌ఫోన్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. పోస్టుమార్టం చేపట్టాక పూర్తి నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.