అంతా మీరేనన్నారు.. అనుచరులపై వేటేశారు.. వాసన్న ఏం చేయబోతున్నారు

|

Sep 30, 2023 | 5:56 PM

జిల్లాలో, పార్టీలో మీ మాటే ఫైనల్‌. ఇక అంతా మీకనుసన్నల్లోనేనని ఆ నాయకుడికి భరోసా ఇచ్చి.. నెలతిరక్కుండానే రివర్స్‌ గేర్‌ వేసింది అధిష్ఠానం. పది రోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్య అనుచరుల సస్పెన్షన్‌తో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట మాజీ మంత్రి. ఒక చేత్తో పెత్తనం ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడంతో కాకమీదున్నారు ఆ సీనియర్‌‌. సెట్‌ అవుతుందనుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధిష్ఠానం యాక్షన్‌కి ఎలా ఉంది రియాక్షన్‌?

అంతా మీరేనన్నారు.. అనుచరులపై వేటేశారు.. వాసన్న ఏం చేయబోతున్నారు
Ongole MLA Balineni Sinivasa Reddy
Image Credit source: TV9 Telugu
Follow us on

అన్నీ ఇక ఆయన చేతులమీదే. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. మొన్నీమధ్యే సమీక్షల తర్వాత రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఓపెన్‌ స్టేట్మెంట్‌ ఇది. దీంతో ఆయన అలకవీడినట్లేనని అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్‌ ఇచ్చింది అధిష్ఠానం. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితులైన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డిలను పదిరోజుల వ్యవధిలో సస్పెండ్‌ చేయడంపై ప్రకాశం వైసీపీలో పెద్ద చర్చే జరుగుతోంది. బాలినేనికి తెలియకుండానే ఆయన అనుచరులపై వేటు వేశారని ప్రచారం జరుగుతోంది. తన అనుచరులను అవమానకరంగా గెంటేయడంపై సీరియస్‌గా ఉన్నారట బాలినేని. అధినేతకు తెలిసే ఇదంతా జరుగుతోందా.. లేదంటే కోటరీయే చక్రం తిప్పుతోందా అన్న డౌట్‌తో ఉన్నారట ఒంగోలు సీనియర్‌.

ప్రకాశంజిల్లా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న బాలినేనికి ఈమధ్యే పార్టీ నాయకత్వం పెత్తనంమీదేనని భరోసా ఇచ్చింది. తనపై బాధ్యతలు పెడుతూ సమీక్షా సమావేశాల్లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకటన చేసి నెల తిరక్కుండానే తన అనుచరులని సస్పెండ్‌ చేయడాన్ని అవమానంగా భావిస్తున్నారట బాలినేని. పర్చూరులో భవనం శ్రీనివాసులురెడ్డి.. బాలినేనికి ప్రధాన అనుచరుడు. భవనం సతీమణి ప్రస్తుతం జడ్పీటీసీ. పర్చూరులో పార్టీ ఇంచార్జిగా ఎవరున్నా భవనం శ్రీనివాసులురెడ్డిని కాదని వెళ్లలేరన్న ప్రచారం ఉంది. అయితే ఆమంచి కృష్ణమోహన్‌ పర్చూరు వైసీపీ ఇంచార్జిగా వచ్చాక పార్టీలో భవనం ప్రాధాన్యం తగ్గిందట. ఆమంచి, బాలినేనికి మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి కారణమంటున్నారు.

పర్చూరు వైసీపీ ఇంచార్జిగా ఆమంచి బాధ్యతల స్వీకరణ సమయంలో బాలినేనికి ఆహ్వానంలేదు. అదే సమయంలో బాలినేనితో విభేదాలున్న వైవీ సుబ్బారెడ్డిని ఆహ్వానించడంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇదే సమయంలో పర్చూరులో పార్టీ వ్యవహారాలపై వైసీపీ అధిష్ఠానానికి కొందరు నేతలు లేఖ రాశారట. ఆమంచిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఫిర్యాదులు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. వీటి వెనుక బాలినేని అనుచరుడు భవనం హస్తం ఉందని అనుమానించారట ఆమంచి. అధిష్ఠాన పెద్దలకు దీనిపై ఆమంచి ఫిర్యాదుచేయటంతో… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భవనం శ్రీనివాసులురెడ్డిని సస్పెండ్‌ చేశారు. అయితే నిర్ణయం తీసుకునేముందు తనకు మాటమాత్రంగానైనా చెప్పకపోవడంతో బాలినేని సీరియస్‌గా ఉన్నారట. ఈ సస్పెన్షన్‌ వ్యవహారంతో పర్చూరులో మరోసారి బాలినేని వర్సెస్‌ ఆమంచి అన్నట్లుంది వైసీపీ రాజకీయం.

పర్చూరు నేత సస్పెన్షన్‌కి పదిరోజుల ముందే మార్కాపురంలో బాలినేని అనుచరుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిపై కూడా పార్టీ నాయకత్వం వేటు వేసింది. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేకి మద్దతిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌పైనా విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. పెద్దిరెడ్డి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతోందనే క్రమశిక్షణాచర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారట అధిష్ఠానపెద్దలు. అయితే తనకు తెలియకుండా పదిరోజుల్లో ఇద్దరు మద్దతుదారులపై వేటువేయడం కాకతాళీయంగా జరగలేదన్న భావనతో ఉన్నారట బాలినేని. వారి సస్పెన్షన్‌ ఎత్తేయాలని బాలినేని పార్టీ అధినేతను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరుల సస్పెన్షన్‌ని బాలినేని సవాలుగా తీసుకోవటంతో.. మళ్లీ మొదటికొచ్చేలా ఉంది ప్రకాశం పంచాయితీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..