ఒంటిమిట్టలో నేడు రాములోరి కల్యాణం..హాజరుకానున్న చంద్రబాబు

కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య వివాహ వేడుకను కనులపండువగా వేదపండితులు నిర్వహించనున్నారు. కల్యాణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకాబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో సీతారాముల కళ్యాణ వేడుక మొదలవుతుంది. […]

ఒంటిమిట్టలో నేడు రాములోరి కల్యాణం..హాజరుకానున్న చంద్రబాబు

Updated on: Apr 18, 2019 | 7:00 AM

కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య వివాహ వేడుకను కనులపండువగా వేదపండితులు నిర్వహించనున్నారు. కల్యాణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకాబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో సీతారాముల కళ్యాణ వేడుక మొదలవుతుంది. ఇప్పటికే భక్తులు, యాత్రికులూ పెద్ద సంఖ్యలో ఒంటిమిట్టకు చేరుకున్నారు. జగదభిరాముని ఆలయంలోని దత్తమండపం, ధ్వజస్తంభం, కల్యాణవేదిక… ప్రత్యేక డెకరేషన్లు, విద్యుత్‌ కాంతులతో కల్యాణశోభను సంతరించుకున్నాయి. ఈ వేడుకను చూసేందుకు లక్ష మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.  స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం వేదికకు కుడి, ఎడమ వైపున ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో అన్నప్రసాదాలతో పాటు తాగునీరు, మజ్జిగ, అక్షతలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది.  ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అభిషేక్‌ మొహంతితో పాటు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో లక్ష్మీకాంతం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేవారు.