
కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. వేంపల్లి మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడిని నమ్మించి భారీగా డబ్బులు తీసుకున్న ఓ మహిళ వ్యవహారం కలకలం రేపుతోంది. కడపకు చెందిన ఓ మహిళ.. వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువకుడికి హామీ ఇచ్చిన సదరు మహిళ.. వివిధ అవసరాల పేరుతో అతడి నుంచి సుమారు రూ.6 లక్షలు తీసుకుని ముఖం చాటేసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మడంతో యువకుడు కూడా ఆమెను పూర్తిగా విశ్వసించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ను కూడా మహిళ చేసింది. దీంతో పెళ్లి ఖాయమని భావించిన యువకుడి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పెళ్లి జరగాల్సిన రోజు ఉదయం సదరు మహిళ అకస్మాత్తుగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో యువకుడు షాక్‌కు గురయ్యాడు.
ఆమె కోసం ప్రయత్నించినా ఆచూకీ లభించకపోవడంతో చివరకు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను ప్రేమ పేరుతో నమ్మించి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఎలా తీసుకుంది? మరెవరైనా ఈ వ్యవహారంలో ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..