
ఆ మహిళ తనకు బిడ్డ పుడుతుందని అని ఎంత మురిసిపోయిందో.. కడుపులోని బిడ్డను కళ్లతో చూశాక.. తన దిష్టి కూడా తగలకుండా జాగ్రత్తలు చేయాలని ఎంత ఆరాపడిందో.. కానీ సరిగ్గా 9 నెలలు నిండిన తర్వాత కడుపులో ఉంది బిడ్డ కాదు గడ్డ అని తెలిసి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక నైరాశ్యంలోకి వెళ్లింది. గుడివాడలో వెలుగుచూసింది ఈ ఘటన. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కడుపులోని గడ్డను.. బిడ్డగా చెబుతూ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు 9 నెలల పాటు వైద్యం చేశారు. నెలలు నిండుతున్నా.. బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు తెలిపింది సదరు మహిళ. దీంతో కనీస సమాచారం ఇవ్వకపోగా.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేశారు అక్కడి సిబ్బంది. కడుపుతీపితో 9 నెలలు అక్కడి వైద్యులు చెప్పిన టీకాలు అంగన్వాడీ సెంటర్‌లోనూ వేయించుకుంది ఆ మహిళ. ఆఖరికి అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా.. బిడ్డ లేదు పెరిగింది గడ్డ అని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. స్కానింగ్ రిపోర్టు తీసుకెళ్లి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని ప్రశ్నించగా.. వాళ్లు నీళ్లు నములుతూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య అందినరోజే ఆ రాజ్యం గొప్పగా ముందుకు సాగుతున్నట్లు. ఇలాంటి కొంతమంది ప్రభుత్వ సిబ్బంది తీరు వల్ల.. ప్రభుత్వ వ్యవస్థలపైనే నమ్మకం లేకుండా పోతుంది.
Also Read: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. సాకారం కాబోతున్న చిరకాల వాంఛ