
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు శివస్వాములు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం నియోజకవర్గం పెంటవెల్లి గ్రామానికి చెందిన ఏడుగురు శివస్వాములు.. పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీశైలం త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించి షార్ట్ కట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించి అటవీ మార్గంలో తప్పిపోయారు. సుమారు ఎనిమిది గంటల పాటు నడిచిన తర్వాత అడవి మార్గంలో తప్పిపోయామని గ్రహించాక.. ఫోన్ సిగ్నల్ దొరకగానే జిల్లా పోలీస్ యంత్రాంగానికి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రంత్ పాటిల్, ఆత్మకూరు D.F.O సాయి బాబా ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దించారు. ఆ టీమ్ అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి..శివ స్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
శ్రీశైలానికి వచ్చే శివ స్వాములు, భక్తులు అటవీ శాఖ అధికారులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని.. గూగుల్ మ్యాప్ లేదా వేరే ఇతర వ్యక్తులను నమ్మి వెళ్తే ప్రమాదాల బారిన పడతారని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి